నల్లగొండ, సెప్టెంబర్ 17 : రానున్న వానకాలం ధాన్యం కొనుగోలు చేయడానికి అవసరమైన కేంద్రాల ప్రారంభానికి ప్రతిపాదనలు పంపాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో మంగళవారం ఆయన అధికారుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో 400 కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని, మూడు రోజుల్లో ప్రతిపాదనలు పంపాలని తెలిపారు.
టార్పాలిన్లు, తూకం వేసే యంత్రాలు, ధాన్యం తూర్పార పట్టే యంత్రాలు ఏర్పాటు చేయడంతో పాటు అన్ని కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని చెప్పారు. అనంతరం ఆయన రైస్ మిల్లర్లతో కస్టమ్ మిల్లింగ్‌పై సమీక్షించారు. 2023-24కు సంబంధించి సెప్టెంబర్ చివరి నాటికి పెండింగ్‌లో ఉన్న సీఎంఆర్ 17శాతం పూర్తి చేయాలన్నారు.ఎన్ఫోర్స్ మెంట్ సిబ్బంది రోజువారీ లక్ష్యాన్ని నిర్దేశించుకొని పర్యవేక్షణ చేయాలని సూచించారు. సమావేశంలో డీఎస్ఓ వెంకటేశ్వర్లు, సివిల్ సైప్లె డీఎం ఎం.హరీశ్, డీఏఓ శ్రవణ్ కుమార్, డీఆర్డీఓ శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.