మిర్యాలగూడ, ఏప్రిల్ 10 : రైతులు మిల్లు పాయింట్లకు వద్దకు తెస్తున్న ధాన్యానికి మద్దతు ధర అందించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రైస్ మిల్లర్లకు సూచించారు. గురువారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే భక్తుల లక్ష్మారెడ్డి, సబ్ కలెక్టర్ నారాయణ అమిత్‌తో కలిసి రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. మిర్యాలగూడ పరిసర ప్రాంతాల రైస్ మిల్లులో ధాన్యం ధరను తగ్గించి కొనుగోలు చేస్తున్నట్లుగా తరచుగా ఫిర్యాదులు వస్తున్నాయని, ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిందే అని రైస్ మిల్లర్లకు ఆదేశించారు. ధాన్యం క్వాలిటీని బట్టి కొద్ది మేరకు తగ్గించవచ్చు కానీ రూ.2,000 నుండి రూ.2,100 వరకు ధరలు వేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైస్ మిల్లుల వద్ద అమ్మకానికి వచ్చిన ట్రాక్టర్లను క్రమ పద్ధతిలో ఉంచి కొనుగోలు చేయాలన్నారు.
ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించకుండా సంబంధిత రైస్ మిల్లుల వారే చర్యలు తీసుకోవాలన్నారు. హెచ్ఎంటి ధాన్యం కొనుగోలులో కొంతమంది మిల్లర్లు నిర్లక్ష్యంగా ఉన్నారని, వారి తీరు మారకపోతే మిల్లులు సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. అన్ని రకాల ధాన్యం కొనుగోలు చేయకపోతే చర్యలు ఉంటాయన్నారు. పట్టణ శివారులోని రైస్ మిల్లులో పది టన్నులకు 40 కిలోల తూకం తేడాలు ఉన్నాయని ఇకమీదట ఇలాంటి చర్యలకు పాల్పడితే వేబ్రిడ్జి సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో సివిల్ సప్లయ్ డీఎం హరీశ్, తాసీల్దార్ హరిబాబు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌరు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వెంకటరమణ చౌదరి, బండారు కుశలయ్య, జైని ప్రకాశ్‌రావు, గుడిపాటి శ్రీనివాస్ పాల్గొన్నారు.