మునుగోడు, ఏప్రిల్ 03 : నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఆస్పత్రులు, మెడికల్ షాపులపై చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్ఐ జిల్లా సహాయక కార్యదర్శి కట్ట లింగస్వామి అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన స్థానిక మండల వైద్యాధికారి మాధురికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా లింగస్వామి మాట్లాడుతూ.. మండలంలో ఆర్ఎంపీ వైద్యులు వాళ్ల పరిధి మించి రోగులకు ఎంబీబీఎస్ డాక్టర్స్ మాదిరి చికిత్సలు అందిస్తున్నట్లు తెలిపారు. పలు సందర్భాల్లో ఈ చికిత్సలు వికటించి రోగులు చనిపోయిన సంఘటనలు ఉన్నట్లు ఆయన గుర్తు చేశారు. అలాగే మెడికల్ షాపుల యాజమాన్యాలు కలిసి మాఫియా ఏర్పడి ప్రజల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపించారు.
ప్రథమ చికిత్స పేరుతో ఆర్ఎంపీ, మెడికల్ షాపుల వద్దకు వెళ్తే కార్పొరేట్ ఆస్పత్రులతో కుమ్మక్కై చిన్న జబ్బును కూడా పెద్దదిగా భయపెడుతూ రోగులను భయభ్రాంతులకు గురిచేస్తూ డబ్బులు దండుకుంటున్నట్లు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే బెల్ట్ షాపుల మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారో, అదేరీతిన మెడికల్ మాఫియా మీద కూడా ఉక్కుపాదం మోపాలని విజ్ఞప్తి చేశారు. ఇకనైనా స్పందించకపోతే రానున్న రోజుల్లో డీవైఎఫ్ఐ ఉద్యమాలు చేస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ మండల అధ్యక్ష, కార్యదర్శులు బొడ్డుపల్లి నరేశ్, యాసరాని వంశీకృష్ణ, ఉపాధ్యక్షుడు కట్ట వెంకన్న, మండల కమిటీ సభ్యుడు మలిగె శివ పాల్గొన్నారు.