– నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
– రైతులు, పార్టీ శ్రేణులతో కలిసి నల్లగొండ కలెక్టరేట్ ముందు ధర్నా
నల్లగొండ, మే 11ర : నల్లగొండ జిల్లా జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లలో రైతులకు జరుగుతున్న అన్యాయాలపై చర్యలు తీసుకోవాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి డిమండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా సోమవారం పలువురు రైతులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులకు జరుగుతున్న అన్యాయాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం చిరుమర్తి మీడియాతో మాట్లాడారు. గత నెల రోజులుగా జిల్లాలోని వివిధ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తూ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. రైతులు తీవ్ర ఇబ్బందులు, ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్లలో అనేక సమస్యలు చోటుచేసుకుంటున్నట్లు చెప్పారు.

‘ధాన్యం కొనుగోళ్లలో రైతులకు జరుగుతున్న అన్యాయాలపై చర్యలు తీసుకోవాలి’
ధాన్యం తరలించేందుకు సరిపడా లారీలు అందుబాటులో లేకపోవడంతో, కొనుగోలు కేంద్రాల్లో వడ్లు రోజుల తరబడి పేరుకుపోవడం, రైతులు తీసుకొచ్చిన వడ్లలో అధికంగా తేమ, నాణ్యత పేరుతో అనవసర కోతలు విధిస్తున్నట్లు దుయ్యబట్టారు. అంతేకాకుండా దళారులు రైతులను భయపెట్టి తక్కువ ధరలకు ధాన్యం కొనుగోలు చేసి అధికంగా డబ్బులు దండుకుంటున్నట్లు వెల్లడించారు. కాంటాలు సకాలంలో జరగక రైతులు ఎండలో, వర్షంలో రోజులు తరబడి వేచి ఉండాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డుల్లో కాంగ్రెస్ నాయకులు, వారి అనుచరులు పెత్తనం చెలాయిస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సరైన పర్యవేక్షణ లేక అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. టార్పాలిన్లు, తాగునీరు, నీడ వంటి కనీస సౌకర్యాలు కూడా కొనుగోలు కేంద్రాల్లో లేవన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లింపులు ఆలస్యం అవడంతో రైతులు అప్పుల పాలవుతున్నారన్నారు.

‘ధాన్యం కొనుగోళ్లలో రైతులకు జరుగుతున్న అన్యాయాలపై చర్యలు తీసుకోవాలి’
కొందరు మధ్యవర్తులు అధికారులతో కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయన్నారు. అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసిపోతున్నా సరైన రక్షణ చర్యలు తీసుకోవడం లేదన్నారు, అన్ని కొనుగోలు కేంద్రాల్లో పారదర్శకంగా కాంటాలు నిర్వహించాలని, సరిపడా లారీలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని వెంటనే తరలించాలన్నారు. రైతుల వడ్లలో అన్యాయ కోతలు నిలిపివేయాలని, దళారుల దందాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మార్కెట్ యార్డుల్లో రాజకీయ జోక్యాన్ని అరికట్టాలన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఇబ్బందులకు గురిచేయకుండా ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలన్నారు. విజ్ఞప్తి సానుకూలంగా స్పందించిన జాయింట్ కలెక్టర్ 15 రోజుల్లోపు ధాన్యాన్ని పూర్తి స్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.