అర్వపల్లి, ఏప్రిల్ 04 : ఇసుక అక్రమ రవాణా జరగకుండా పోలీసులు తనిఖీ చేసి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. శుక్రవారం అర్వపల్లి పోలీస్ స్టేషన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను, సీజ్ చేసిన వాహనాలను పరిశీలించారు. అలాగే రిసెప్షన్, ఫిర్యాదు నిర్వహణ, స్టేషన్ రికార్డ్స్, హిస్టరీ షీట్స్, మండల భౌగోళిక స్థితి, నేరాల నమోదు, కేసుల స్థితిగతులు, కోర్టు క్యాలెండర్, సాంకేతికత మొదలగు వాటిని పరిశీలించారు. అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలను నిరోదించాలని ఆదేశించారు.
సిబ్బంది బాధ్యతగా పనిచేస్తూ మండల పరిధిలో పెట్రోలింగ్ పెంచాలని, డయల్ 100 కాల్స్ పై వేగంగా స్పందించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అనుమతుల పేరిట ఇసుక అక్రమ రవాణా జరగకుండా నిరంతరం తనిఖీలు చేయాలని వాహనాల అనుమతుల రసీదులు పరిశీలించాలని తెలిపారు. రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఇసుక అక్రమ రవాణా జరగకుండా అరికట్టాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ పార్థసారథి, నాగారం సీఐ రఘువీర్ రెడ్డి, ఎస్ఐ బాలకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.