కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ఫలితం సూర్యాపేట జిల్లాకు దక్కిన విషయం తెలిసిందే. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 7న జల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లాకు గోదావరి నీళ్లు తెచ్చి బీడు భూములను పచ్చగా మార్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞత తెలిపేందుకు రైతులు ఎస్సారెస్పీ కాల్వల వెంట లక్ష హారతులు పట్టబోతున్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో నాగారం మండలం ఈటూరు నుంచి పెన్‌పహాడ్ మండలం రావిచెరువు వరకు దాదాపు 60 కిలోమీటర్ల మేర కార్యక్రమం చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
– సూర్యాపేట, జూన్ 5 (నమస్తే తెలంగాణ)
సూర్యాపేట, జూన్ 5 (నమస్తే తెలంగాణ) : జిల్లాకు గోదావరి జలాలు తెచ్చి బీడు భూములను పచ్చగా మార్చిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ లక్షలాది మంది రైతులతో కాళేశ్వర జలాలకు లక్ష హారతి పట్టబోతున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 7న జలదినోత్సవం రోజున మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో నాగారం మండలం ఈటూరు నుంచి పెన్‌పహాడ్ మండలం రావిచెరువు వరకు లక్షలాది మంది రైతులతో గోదావరి జలాలకు హారతి పట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు 60 కిలోమీటర్ల మేర కార్యక్రమం నిర్వహించనున్నారు.
పుష్కలంగా గోదావరి జలాలు..
సీఎం కేసీఆర్ అకుంటిత దీక్షతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ సూర్యాపేట జిల్లాకు వర ప్రదాయినిగా మారింది. కాళేశ్వరం నుంచి సుమారు 250 కిలోమీటర్లు ప్రయాణించిన గోదావరి జలాలు సూర్యాపేట జిల్లాను సస్యశ్యామలం చేశాయి. గత పాలకులు ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు పేరుతో మెతకగా ఉన్న చోట మాత్రమే కాల్వలు తవ్వారు. ఆ కాలువల్లో నీరు పారేందుకు అసలు ప్రాజెక్టే లేదు. అంటే కేవలం కమీషన్ల కోసమే కాల్వలు తవ్విపెట్టారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను కేవలం నాలుగు సంవత్సరాల లోపే పూర్తి చేయించారు. దాని తొలి ఫలితం నేడు జిల్లాకు దక్కింది. కాలేళ్వర జలాలతో ఇప్పటి వరకు ఒట్టి పోతున్న చెరువులు జలకళను సంతరించుకున్నాయి. నెర్రెలు బారి దుమ్ముకొట్టుకు పోయిన భూములు పచ్చబడ్డాయి. ఆరేళ్లుగా జిల్లాలోని ప్రధాన కాల్వలైన డీబీఎం 69,70,71ల ద్వారా నీరు ప్రవహిస్తుండగా తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాల ఆయకట్టు పరిధిలోని 215 గ్రామాల్లోని 300లకు పైగా చెరువులు, కుంటలకు జలకళ సంతరించుకోవడంతో పాటు నేరుగా పంట పొలాల్లోకి జలాలు చేరుతున్నాయి. జిల్లాలోని చివరి ఆయకట్టు అయిన పెన్‌పహాడ్ మండలం రావిచెరువు నిండుతోంది. మూడు నియోజకవర్గాల పరిధిలోని 13 మండలాల్లో 2.40 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతున్నది. దాంతో రైతులు నేడు వ్యవసాయంలో బిజీగా ఉంటూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. జిల్లాలోని లక్షలాది ఎకరాల బీడుభూములను గోదావరి జలాలతో సస్యశ్యామలం చేసిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెప్పేందుకు జిల్లా రైతాంగం సిద్ధమైంది. అందులో భాగంగానే ఈ నెల 7న మంత్రి జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో లక్షలాది మందితో గోదావరి జలాలకు హారతి పట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
నీళ్లు పుష్కలంగా అందుతున్నయ్
తెలంగాణ రాక ముందు మా గ్రామంల చెరువుల్లో నీరు లేక పొలాలు నెర్రెలు బారేవి. సాగు, తాగునీరు లేక ఇబ్బందులు పడ్డం. 200ఫీట్ల వరకు బోర్ వేసినా నీళ్లు పడని పరిస్థితి ఉండేది. నాకు నాలుగు ఎకరాల భూమి ఉంది. బావిలో కొద్దిమాత్రంలో ఉన్న నీల్లు కనీసం 10 గుంటలకు కూడా అందక పొలం ఎండిపోయేది. దాంతో చేసేదిలేక నాతోపాటు మాఊరి రైతులు వ్యవసాయం వదిలిపెట్టి పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్ వెళ్లి కూలిపనులు చేసుకొని బతికినం. తెలంగాణ ఏర్పాటైన తరువాత సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడంతో కాల్వల్లో నిత్యం గోదావరి జలాలు వస్తున్నయి. చెరువులు నిండడంతో బోర్లు, బావుల్లో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. నాకున్న నాలుగు ఎకరాలు పూర్తిగా సాగు చేసుకుంటున్న. ఇదంతా సీఎం కేసీఆర్‌సార్ పుణ్యమే. అందుకే లక్ష హరతులతో ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతాం.
– పసుల మల్లయ్య, బొల్లంపల్లి, అర్వపల్లి