యాదగిరిగుట్ట, జూన్ 8: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మల్లాపురం గ్రామానికి మంజూరైన ప్రభుత్వ వైద్య కళాశాలతోపాటు వందపడకల దవాఖానను వెంటనే నిర్మించాలని బీఆర్ఎస్ యువజన, విద్యార్థి విభాగం నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని మల్లాపురంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఉదయం దీక్షను బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా యువజన, విద్యార్థి విభాగం నాయకులు మాట్లాడుతూ కేసీఆర్ 2023 సెప్టెంబర్ 18న రూ.183 కోట్ల నిధులు కేటాయిస్తూ జీవో 85 విడుదల చేశారన్నారు. 8 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లను కలుపుకొని 433 మంది వివిధ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బందిని నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారన్నారు.
అప్పట్లో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి వారి పేరుతో మంజూరైన వైద్య కళాశాలను గుట్టకు కూతవేటు దూరంలో ఉన్న మల్లాపురంలోని సర్వే నంబర్ 84లో 200 ఎకరాల ప్రభుత్వ భూమిలో నిర్మించాలని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదన్నారు. గతం లో కలెక్టర్లు, వైద్యాశాఖ అధికారులు సైతం భూమిని పరిశీలించి, గుర్తించారని తెలిపారు. గత శుక్రవారం తిరుమలాపూర్లో ముఖ్యమం త్రి రేవంత్రెడ్డి వైద్య కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేసినా ఇప్పటివరకు ఎక్కడ నిర్మిస్తారో స్పష్టత ఇవ్వలేదన్నారు. యాదగిరిగుట్టలో అనువైన భవనాలు ఉన్నా 2024-25 విద్యా సంవత్సరం ఎంబీబీఎస్ తరగతులను భువనగిరిలో కొనసాగించడంపై అనుమానం కలుగుతుందన్నారు. మల్లాపురంలో కళాశాల ఏర్పాటు చేయడం స్థానిక ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యకు ఇష్టంలేనట్లుగా కనిపిస్తున్నదన్నారు. దీంతో మల్లాపురం గ్రామానికి చెందిన ఎంతో మంది యువత ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.
గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు స్పందించి ఎమ్మెల్యేను ఒప్పించి గ్రామంలోనే వైద్య కళాశాల ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. లేకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారన్నారు. దాతారుపల్లి గ్రామంలో 152,153,156,157 నంబర్లలో నిర్మిస్తున్నట్లు సమాచారం వస్తున్నదన్నారు. ఇదే జరిగితే మల్లాపురం గ్రామానికి తీరని అన్యా యం జరుగుతుందన్నారు. వెంటనే స్థానిక ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పునరాలోచన చేసి మల్లాపురంలో వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలన్నారు. గ్రామంలో పనులు ప్రారంభించేంతవరకు రిలే నిరాహార దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గ ఉపాధ్యక్షు డు ఒగ్గు మల్లేశ్, విద్యార్థి విభాగం మండల నాయకుడు మోటే శేఖర్, నాయకులు కర్రె చంద్రశేఖర్, దుద్దురు సిద్ధు లు, పుచ్చుల నర్సింహులు, బరిగే రాజు, ఓరుగంటి శ్రీధర్, కర్రె మధు, ఇండ్ల ప్రసాద్, దేవరుప్పల నరేందర్ తదితరులు పాల్గొన్నారు.