రామగిరి, జనవరి 14: ధనుర్మాసోత్సవాల్లో భాగంగా నల్లగొండ పట్టణంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో గోదాదేవి రంగనాథుల కల్యాణాన్ని శనివారం రాత్రి వైభవంగా నిర్వహించారు. యాజ్ఞికులు పవన్‌కుమార్ బృందం ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛరణాల మధ్య కల్యాణాన్ని జరిపించారు. కల్యాణోత్సవానికి 650 మంది దంపతులతో పాటు భక్తులు భారీ సంఖ్యలో హాజరై తిలకించారు. విష్ణు చిత్తుడి కుమార్తె గోదాదేవితో అవతారమూర్తి పాండురంగనాథస్వామి కల్యాణోత్సవాన్ని పంచరాత్ర ఆగమశాస్త్ర రీతిలో వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ కనుల పండువగా జరిగింది. జీలకర్రబెల్లం అనంతరం భక్త జనుల గోవింద నామస్మరణల మధ్య గోదాదేవి మెడలో రంగనాథస్వామి మంగళసూత్రధారణ కార్యక్రమం నిర్వహించారు. కల్యాణం సందర్భంగా రామాలయం అంతా విద్యుత్ దీపాలతో అలంకరించారు. పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు పర్యవేక్షించారు. ఈ వేడుకలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి,రమాదేవి దంపతులు, ఆలయ అభివృద్ధ్ది కమిటీ చైర్మన్ చకిలం వేణుగోపాల్‌రావు, సంధ్యారాణి దంపతులు, కౌన్సిలర్ యామా కవితాదయాకర్ దంపతులు స్వామి, అమ్మవార్ల తరుఫున కూర్చోని కల్యాణం నిర్వహించారు. ఈ వేడుకల్లో మంత్రి కేటీఆర్ పేచీకి చెందిన అధికారులు, రాష్ట్ర ఆడిట్ అధికారులు జిల్లా నుంచి అధిక సంఖ్యలో దంపతులు పాల్గొని పూజలు చేయించడం విశేషం. కార్యక్రమంలో దేవాలయం ఈఓ జె.జయరామయ్య, ఉమ్మడి జిల్లా దేవాదాయ దర్మాదాయశాఖ సూపర్వైజర్ లక్ష్మి మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్‌గౌడ్, ఆర్డీఓ జయచంద్రరెడ్డి పాల్గొన్నారు.
తలంబ్రాలు అందజేసిన ఎమ్మెల్యే
తిరుకల్యాణ మహోత్సవానికి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, రమాదేవి దంపతులు క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసి పట్టు వస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలను అందజేశారు. ఆలయ చైర్మన్ చకిలం వేణుగోపాలరావు -సంధ్యారాణి దంపతులు వేరు వేరుగా వారి ఇంటి నుంచి స్వామి వారికి పట్టు వస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు మేళ తాళాల మద్య ఆలయానికి తీసుకొచ్చి సమర్పించారు.
నకిరేకల్ మండలం పాలెంలో..
నకిరేకల్ : మండలంలోని పాలెం గ్రామంలో కూర్మగిరి సుందర లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో శనివారం శ్రీ గోదాదేవి రంగనాథస్వామి వారి కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్, షిప్ అండ్ గోట్ కార్పొరేషన్ ఛైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ పాల్గొన్నారు. అనంతరం పల్లకీలో స్వామివార్లను దేవాలయంలో ప్రతిష్టించారు. ఈ కల్యాణానికి దాదాపు 5 వేలకు మంది పైగా భక్తులు హాజరై తమ మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ముఖ్యఅథితులు అన్నదానంనిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సేవా సమితి ప్రతినిధులు కిషన్‌రావు, కళ్యాణ్‌రావు, గ్రామసర్పంచి ఏకుల కవిత విజయ్ కుమార్ పాల్గొన్నారు.