HomeNalgonda503411 Households Were Identified In The Comprehensive Family Survey
సర్వేకు 5,03,411 ఇండ్ల గుర్తింపు
సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా ఇండ్ల జాబితాను పూర్తి చేయడం జరిగిందని, శనివారం నుం చి కుటుంబ వివరాల సేకరణను ప్రారంభించామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వేపై శనివారం కలెక్టరేట్లో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహణకు 3,970 ఎన్యుమరేషన్ బ్లాక్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
మొదలైన కుటంబ వివరాల సేకరణ
ప్రజలు సహకరించాలి
నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్లగొండ ప్రతినిధి, నవంబర్9 (నమస్తే తెలంగాణ) : సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా ఇండ్ల జాబితాను పూర్తి చేయడం జరిగిందని, శనివారం నుంచి కుటుంబ వివరాల సేకరణను ప్రారంభించామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వేపై శనివారం కలెక్టరేట్లో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహణకు 3,970 ఎన్యుమరేషన్ బ్లాక్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో 3,131, పట్టణ ప్రాంతంలో 839 ఎన్యుమరేషన్ బ్లాకులు ఉన్నాయని వివరించారు.
3,832 మంది ఎన్యుమరేటర్లు, 386 మంది సూపర్వైజర్లను సర్వే కోసం నియమించినట్లు చెప్పారు. జిల్లాలో మొత్తం 5,03,411 ఇండ్లను గుర్తించామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే చారిత్రక కార్యక్రమని, భవిష్యత్లో సమగ్ర కుటుంబ సర్వే ద్వారా సేకరించిన డేటా వివిధ కార్యక్రమాలను సవ్యంగా నిర్వహించేందుకు ఉపయోగపడుతుందని అన్నారు.
సర్వే కోసం ఎన్యుమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు ప్రజలు ఆధార్, ధరణి, బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్ వంటివి సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. సర్వే వల్ల ఇబ్బందేమీ లేదని, సమగ్ర కుటుంబ సర్వే సమాచారాన్ని గోప్యంగా ఉంచుతారని చెప్పారు. ఈ సమాచారాన్ని ఎవరికీ వెళ్లదని, ప్రశ్నల ద్వారా సేకరించిన వివరాలను డేటా ఎంట్రీ చేసి భద్రపరుస్తామని తెలిపారు. అందుకోసం మండల, మున్సిపల్ స్థాయిలో అందుబాటులో ఉన్న సుమారు 2,835 డేటా ఎంట్రీ ఆపరేటర్లను గుర్తించామన్నారు.
అవసరమైతే మరి కొందరిని గుర్తిస్తామన్నారు. ఎన్యుమరేటర్లు దగ్గరుండి డేటా ఎంట్రీ చేయిస్తారని చెప్పారు. సర్వేకు సంబంధించి ప్రజలను ప్రభుత్వం ఎలాంటి ఓటీపీ చెప్పమని అడగడం లేదా లింకు పంపించడం జరుగదన్నారు. బ్యాంక్, ఆధార్ నంబర్ల దుర్వినియోగం ఉండదన్నారు. సమగ్ర కుటుంబ సర్వే వివరాలు సూక్ష్మస్థాయిలో పనికి వస్తాయని, అన్ని రెసిడెన్షియల్ ఆవాసాల్లో వీటిని సేకరించడం జరుగుతుందని, శాస్త్రయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి ప్రజలంతా సహకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. సమావేశంలో సమాచార శాఖ సహాయ సంచాలకులు యు.వెంకటేశ్వర్లు, ఆర్డీఓ అశోక్ రెడ్డి, సీపీఓ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ ముసాబ్ అహ్మద్ ఉన్నారు.