సుభాష్‌నగర్, మార్చి 8: మార్చి ప్రారంభంలోనే ఎండలు మండుతున్నాయి. భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఉదయం నుంచే తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఏప్రిల్ రాకముందే ఎండల తీవ్రత రోజురోజుకూ అధికమవుతున్నది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం బెంబేలెత్తుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఆదివారం గరిష్ఠ ఉష్ణోగ్రత 37.6 డిగ్రీలుగా నమోదయ్యింది. ఐదు రోజులుగా జిల్లాలో క్రమంగా 2.5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఉదయం 11గంటలకే భానుడు భగభగ మంటున్నాడు. సాయంత్రం 6గంటల వరకు ఎండవేడిమి ఉంటుంది. దీంతో పనుల మీద బయటికెళ్లిన వారు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. మధ్యాహ్నం వరకే పనులు ముగించుకొని ఇండ్లకు చేరే ప్రయత్నాలు చేస్తున్నారు. ఉపశమనం పొందడానికి ఫ్యాన్లు, ఏసీలను ఆశ్రయిస్తున్నారు. జిల్లాతో పాటు పలు మండలాల్లో 35 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదుకావడం గమనార్హం. ఇప్పు డే ఎండలు ఈవిధంగా ఉంటే మున్ముందు ఇంకెలా ఉంటుందోనని జనం ఆందోళన చెందుతున్నారు.
నిర్మానుష్యంగా రోడ్లు
జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్, వర్ని చౌరస్తా, ఖిల్లా, దుబ్బ, సుభాష్‌నగర్, బైపాస్‌రోడ్ తదితర ప్రాంతాల్లో రోడ్లు మధ్యాహ్నం సమయంలో నిర్మానుష్యంగా మారుతున్నాయి. అత్యఅవసర పనులపై బయటికి వస్తున్న వారు మజ్జిగ, కొబ్బరినీళ్లు, చెరుకు, పండ్ల రసాలను తాగుతూ ఉపశమనం పొందుతున్నారు ద్విచక్ర వాహనదారులు తలపై టోపీలు ధరిస్తూ, ముఖాలకు గుడ్డలు కట్టుకొని జాగ్రత్త పడుతున్నారు. పాదాచారులు గొడుగు నీడన అడుగులువేస్తూ భానుడి ప్రతాపం నుంచి తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నారు.
జిల్లాలో ఐదురోజులుగా నమోదైన ఉష్ణోగ్రతలు
తేదీ : ఉష్ణోగ్రత
మార్చి 4 : 35 డిగ్రీలు
మార్చి 5 : 36.5
మార్చి 6 : 36.8
మార్చి 7 :38.6
మార్చి 8 : 37.9