నార్కట్‌పల్లి, జూలై 26 : నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు గుట్టకింద షార్ట్‌సర్క్యూట్‌తో ఆదివారం 15 దుకాణాలు, భవనాలు దగ్ధమయ్యాయి. గ్రామ పంచాయతీ కార్యాలయం పరిధిలో 15 దుకాణాలు ఉండగా ఉదయం 3 గంటల ప్రాంతంలో ఒకరి షాపులో విద్యుత్తు షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఇతర దుకాణాలకు వ్యాపించాయి. రెండిండ్లలో ఉన్న గ్యాస్ సిలిండర్లు పేలి గ్రామ పంచాయతీకి మంటలు వ్యాపించడంతో కార్యాలయంలోని రికార్డులు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం బాధితులను పరామర్శించి ప్రభుత్వంతో మాట్లాడి న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు.
ఒక్కొక్కరికి రూ. 20 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బాధితులకు మనోధైర్యాన్ని కల్పించి మాట్లాడారు. అగ్ని ప్రమాదంలో నష్టపోయిన దుకాణాదారులకు ప్రభుత్వం ఒక్కొక్కరికీ రూ. 20 లక్షలు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ప్రమాదంలో రూ. 8 కోట్ల వరకు ఆస్తి నష్టం సంభవించిందని, ఎటువంటి ప్రాణ నష్టం జరుగలేదని చెప్పారు. జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి బాధితులను ఓదార్చారు. బాధితులకు రూ. 10 లక్షల నష్ట పరిహారం అందించి. గుట్టపై వ్యాపారాలు చేసుకునేలా వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
