చండూరు, అక్టోబర్ 18 : కేంద్ర ప్రభుత్వం వెంటనే 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని చండూరు అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా బీసీ జేఏసీ పిలుపు మేరకు శనివారం చండూరు మండల కేంద్రంలో చేపట్టిన బంద్ విజయవంతం అయింది. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం, బీసీ అఖిలపక్ష నాయకులు, కార్యకర్తలందరూ కలిసి బీసీ రిజర్వేషన్ బిల్లును వెంటనే ఆమోదించాలని నిరసన తెలియజేస్తూ రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. మండలంలోని వాణిజ్య సముదాయాలు, పాఠశాలలు, కళాశాలలు బంద్కు సంఘీభావంగా స్వచ్ఛందంగా మూతపడ్డాయి.
ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ ఏ ఒక్కరు బీసీ రిజర్వేషన్లపై మాట్లాడకపోవడం దారణమన్నారు. ఎస్సీలు, బీసీలు రాజకీయంగా ఎదగాలంటే జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు . కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వీడకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో చండూరు మాజీ ఎంపీపీ తోకల వెంకన్న, బీఆర్ఎస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు బొమ్మరబోయిన వెంకన్న, కొత్తపాటి సతీశ్, కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు కొరివి ఓంకారం, అనంత చంద్రశేఖర్, బీజేపీ మండల, పట్టణ అధ్యక్షులు ముదిగొండ ఆంజనేయులు, పందుల సత్యం గౌడ్, సీపీఐ మండల కార్యదర్శి నలపరాజు సతీశ్, సీపీఎం మండలాధ్యక్షుడు జేరిపోతుల ధనంజయ్ గౌడ్, బహుజన్ సమాజ్ వాజ్ పార్టీ మునుగోడు నియోజకవర్గం నాయకుడు కట్ల జగన్నాథం, వివిధ పార్టీలకు చెందిన బీసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.