నల్లగొండ, ఏప్రిల్ 26 : తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించి 21 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో బుధవారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ప్లీనరీ నిర్వహిస్తున్నట్లు రాజ్యసభ సభ్యుడు, టీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య తెలిపారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో విలేకరులతో మంగళవారం ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పార్టీ మండలాధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలతో పాటు మొత్తంగా 280 మంది ప్రతినిధులు ప్లీనరీకి హాజరుకానున్నట్లు వెల్లడించారు. డెలిగేట్ పాస్‌లు అందిన వారంతా ఉదయం 9గంటల వరకు హైటెక్స్‌కు చేరుకుని పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి గ్రామం, వార్డులో పార్టీ జెండాలు ఆవిష్కరించాలని పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, భవిష్యత్ ప్రణాళికపై ప్లీనరీలో చర్చించనున్నట్లు వెల్లడించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో చేసిన అభివృద్ధి వల్ల దేశంలోనే తెలంగాణ రోల్ మోడల్‌గా నిలిచిందని తెలిపారు. ప్రధానంగా వ్యవసాయాభివృద్ధి, రైతు సంక్షేమం కోసం చేపట్టిన రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ, సంక్షేమం దృష్ట్యా చేపట్టిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలు దేశ ప్రజలను ఆకర్షిస్తున్నాయని తెలిపారు. స్టాలిన్, అఖిలేశ్, రాకేశ్ టికాయత్ లాంటి నాయకులు దేశ రాజకీయాల్లో కేసీఆర్ అవసరం అని భావిస్తున్నారన్నారు. దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ పాత్రపై ప్లీనరీలో నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పిల్లి రామరాజు యాదవ్, లొడంగి గోవర్ధన్, ఎడ్ల శ్రీను, గోగుల శ్రీను, ఈరటి బాలరాజు, జంగయ్య పాల్గొన్నారు.