సూర్యాపేట, నవంబర్ 17: సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం ధాన్యం పొటెత్తింది. సూర్యాపేట పరిసర ప్రాంత రైతులు ధాన్యాన్ని విక్రయించే నిమిత్తం పెద్దమొత్తంలో మార్కెట్‌కు ధాన్యం తీసుకొచ్చారు. ప్రభుత్వం అరకొరగా ధాన్యం కొనుగోలు కేం ద్రాలు ఏర్పాటు చేయడం, వాటిల్లో కొనుగోళ్లు చేపట్టకపోవడంతో రైతు లు ప్రైవేట్ వ్యాపారుల వైపు మొగ్గు చూపుతున్నారు. సోమవారం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌కు 409 మంది రైతులు 22, 496 బస్తాల ధాన్యం తెచ్చారు. ధర విషయంలో రైతులకు ఇబ్బంది లేకుండా అధికారులు వ్యాపారులతో మాట్లాడి ఏర్పాట్లు చేశారు.
పాత బీపీటీ క్విం టాకు రూ. 1839, బీపీటీ పాతవి క్వింటాకు రూ. 2019, జై శ్రీరాం ధాన్యం క్వింటాకు రూ. 1611, జైశ్రీరాం పాత ధాన్యం క్వింటాకు రూ. 2149, ఐఆర్ 64 రకం క్వింటాకు రూ. 1509, హెచ్ఎంటీ రకం క్వింటాకు రూ. 1686, ఆర్ఎన్ఆర్ రకం క్వింటాకు రూ. 1806 ధర పలికింది. ఈ ధరలు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లోని ఏ గ్రేడ్ ధాన్యానికి రూ. 2389, బీ గ్రేడ్ ధాన్యానికి రూ.2369 పెట్టిన మద్దతు ధర కంటే తక్కువే అయినప్పటికీ రైతులు కొనుగోలు కేంద్రాల్లోని వెతలు పడలేక బయట మార్కెట్లో అగ్గువకే అమ్ముకునేందుకే ఆసక్తి చూపుతున్నారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని వ్యాపారులు, కమీషన్ దారులు నాణ్యమైన ధాన్యానికి సైతం తక్కువ ధరనే కోట్ చేస్తూ రైతుల ఆశలను నీరుగారుస్తున్నారు.
ఆరుగాలం కష్టపడి ఎన్నో వ్యయ ప్రయాసాలకోర్చి రైతులు తమ ధాన్యాన్ని మార్కెట్‌కు తెస్తే తక్కువ ధరకు కోట్ చేయడంతో మళ్లీ ట్రాన్స్‌పోర్టు ఖర్చులు భరించలేక అడ్డికి పావుశేరు లెక్కన అమ్ముకున్నా పెట్టుబడి కూడా రావడంలేదని రైతులు కంటతడి పెట్టారు. కొత్త ధాన్యానికి తేమ, చెత్త, తాలు తదితర కారణాలు చెబుతున్న వ్యాపారులు పాత ధాన్యానికి సైతం ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర చెల్లించక పోవడంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ వానకాలం సీజన్‌కు సంబంధించి ధాన్యం రాక ఇప్పుడే ప్రారంభమైనందున మునుముందు మార్కెట్‌కు భారీగా ధాన్యం వచ్చే అవకాశాలు ఉన్నందున వ్యాపారులు, కమీషన్‌దారుల చేతుల్లో రైతులు మోసపోకుండా ఉన్నతాధికారులు వ్యవసాయ మార్కెట్లోని రైతుల ధాన్యానికి గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.