దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకం ప్రవేశపెట్టారు. రాష్ట్రం నలు దిక్కుల నుంచి నాలుగు మండలాలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఇందులో భాగంగా తిరుమలగిరి మండలాన్ని మొదటి దశలో ఎంపిక చేసి 2,223 మంది దళిత కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున అందజేశారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.250 కోట్లు వెచ్చించింది. ప్రభుత్వం అందించిన డబ్బుతో లబ్ధిదారులు తమకు నచ్చిన యూనిట్లు ఏర్పాటు చేసుకొని జీవనోపాధి పొందుతూ ఆర్థికంగా బలోపేతం అవుతున్నారు. సర్కారు సాయంతో నాడు కూలీలుగా ఉన్న దళితులు నేడు ఓనర్లుగా మారారు. ప్రధానంగా ఆటోలు, ట్రాలీలు, జేసీబీలు, ఫొటో స్టూడియోలు, ఫ్లెక్సీ షాపులు, మినీ డెయిరీ ఫామ్‌లు నడుపుకొంటూ సంతోషంగా జీవిస్తున్నారు.
మూడోసారి గాదరి కిశోర్‌కుమార్‌ను గెలిపిస్తే నియోజకవర్గమంతా దళితబంధు ఇస్తామని ఇటీవల తిరుమలగిరిలో నిర్వహించిన తుంగతుర్తి సమర శంఖారావం సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. దాంతో నియోజకవర్గంలోని దళితులంతా తమ బతుకులు మారనున్నాయని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కిశోర్‌కుమార్‌ను మళ్లీ గెలిపించుకోవాలనే దృఢ సంకల్పంతో కనిపిస్తున్నారు. నియోజకవర్గంలో ఎస్సీ జనాభా 76,850 మంది ఉండగా, బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే వీరి తలరాతలు మారనున్నాయి. ఇప్పటికే బీసీ బంధు, ముస్లిం బంధు కింద మొదటి విడుతలో లక్ష చొప్పున ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ మాట ఇస్తే వెనక్కి తగ్గరని ప్రజలు విశ్వసిస్తున్నారు.
మాది తిరుమలగిరి మండలంలోని గుండెపురి గ్రామం. బతుకుదెరువు కోసం నేను, మా అన్న హైదరాబాద్‌లో మార్వాడీలకు చెందిన ఫ్లైవుడ్, హార్డ్‌వేర్ షాపులో గుమస్తాగా చేసేది. నెలకు చెరో రూ.10 వేలు వచ్చేది. మాకు ఇద్దరిద్దరు పిల్లలు. కుటుంబం గడవటం కష్టంగా ఉండేది. ఈ తరుణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తిరుమలగిరి మండలాన్ని దళితబంధు పైలెట్ ప్రాజెక్ట్ కింద ప్రకటించారు. దాంతో మా తలరాత మారింది. మేము మా గ్రామానికి వచ్చి ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతో తిరుమలగిరిలో ఫ్లైవుడ్, హార్డ్‌వేర్ షాపు పెట్టుకున్నాం. గిరాకీ బాగానే వస్తుంది. నెలకు రూ.40వేల వరకు సంపాదిస్తున్నాం. ఎంతో సంతోషంగా ఉన్నది. దళిత బంధు పథకం లేకపోతే నానా అవస్థలు పడాల్సి వచ్చేది. ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.10 లక్షలు ఇచ్చి మాకు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాం.
– పల్లెపాక పరశురాం, హార్డ్‌వేర్ షాపు నిర్వాహకుడు, తిరుమలగిరి మండలం
గతంలో నేను, మా అన్న మధు తిరుమలగిరిలో ఫ్లెక్సీ షాపుల్లో పని చేసేవాళ్లం. నేను సూపర్వైజర్గా, అన్నయ్య డిజైనర్‌గా వేర్వేరు షాపుల్లో పని చేసేది. అలా మూడేండ్లు చేశాం. నెలకు నాకు రూ.12 వేలు, అన్నయ్యకు రూ.8వేల జీతం వచ్చేది. ఎక్కువ పని గంటలు చేయాల్సి వచ్చేది. నాడు చాలీచాలని వేతనంతో జీవనం కష్టంగా ఉండేది. దళితబంధు పథకం కింద తిరుమలగిరి మండలం పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపికవడంతో మాకు కూడా అవకాశం దొరికింది. సంవత్సరం క్రితం దళితబంధు పథకంలో వచ్చిన రూ.10 లక్షలతో డిజిటల్ ఫ్లెక్సీ సెంటర్‌ను పెట్టాం. ఇప్పుడు చేతి నిండా పని దొరుకుతుంది. మాతోపాటు నలుగురికి జీవనోపాధి కల్పిస్తున్నాం. నెలకు రూ.40 వేలు సంపాదిస్తున్నాం. ఆనందంగా ఉన్నది. ఒకరి దగ్గర పనిచేయాల్సిన అవసరం లేకుండా పోయింది. ముఖ్యమంతి కేసీఆర్ పుణ్యమా అని వర్కర్ల నుంచి ఓనర్లమయ్యాం.
– కొమ్ము నవీన్, ఫ్లెక్సీషాపు నిర్వాహకుడు, నందాపురం, తిరుమలగిరి మండలం
దళిత బంధు పైలెట్ ప్రాజెక్ట్ కింది తిరుమలగిరి మండలం ఎంపికవడంతో దరఖాస్తు చేసుకున్నా. నాకు వచ్చిన డబ్బుతో తిరుమలగిరిలో ఫొటోస్టూడియో పెట్టుకున్నా. గతంలో రూ.5 వేలకు స్టూడియోలో పని చేసేవాడిని. చాలీచాలని వేతనంతో కుటుంబ జీవనం భారమయ్యేది. ఇప్పుడు ఫొటో స్టూడియోతో నెలకు రూ.30వేలు సంపాదిస్తున్నా. దళిత బంధు వచ్చి నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. ఇప్పుడు నా కాళ్లపై నేను నిలబడ్డా. ఎవరి దగ్గరా పని చేసే అవసరం లేదు.
– గుండెపురి లాలు, ఫొటో స్టూడియో నిర్వాహకుడు, తిరుమలగిరి
మాది వ్యవసాయ కూలీ కుటుంబం. అమ్మానాన్న వ్యవసాయ పనులకు వెళ్లేవాళ్లు. నేను డిగ్రీ పూర్తి చేసి స్థానిక బట్టల షాపులో గుమస్తాగా పనికి కుదిరాను. ఏడు సంవత్సరాలుగా రోజూ 12 గంటలపాటు పని చేస్తే నెలకు రూ.9వేలు మాత్రమే వచ్చేవి. ఆ డబ్బుతో ఇల్లు గడవడం కష్టంగా ఉండేది. నాన్న కాలుకు ఇన్ఫెక్షన్ అయితే ఆపరేషన్ కోసం అప్పు చేసి దవాఖాన బిల్లులు కట్టాల్సి వచ్చింది. ఇలాంటి దయనీయ స్థితిలో ఉన్న మమ్మల్ని దళితబంధు పథకం ఆదుకున్నది. ప్రభుత్వం అందించిన రూ.10 లక్షలతో నాతోపాటు పత్తేపురం త్రిశూల్, కందుకూరి వెంకన్నతో కలిసి జేసీబీని తీసుకున్నాం. దాంతో మా ముగ్గురి జీవితాల్లో వెలుగులు నిండాయి. ఏ ఒక్కరోజూ ఖాళీ లేకుండా నిత్యం పని దొరుకుతున్నది. ఖర్చులు పోను ఒక్కొక్కరికి రూ.25వేల చొప్పున మిగులుతున్నాయి. ఒకరి కింద ఉద్యోగం చేసి అగచాట్లు పడ్డ మాకు దళితబంధు కల్పతరువుగా మారింది. తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు.