తీరు మారలే.. అక్రమణలు ఆగలే

కుచించుకుపోతున్న కాల్వలు అడ్డూఅదుపూ లేకుండా అక్రమ నిర్మాణాలుచోద్యం చూస్తున్న ఐబీ అధికారులు నల్లచౌట చెరువుకు వరద ముప్పుమిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులను పునరుద్ధరించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషిచేస్తుంటే... చెరువుల పరిరక్షణకు బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన చిన్ననీటి పారుదల శాఖాధికారులు చెరువు శిఖం కళ్లముందే కబ్జాకు గురవుతున్నా నోరు మెదపడం లేదు. ఈ కారణంగా మండల కేంద్రంలోని నల్లచౌట చెరువు పరిధిలోని శిఖం వందల ఎకరాలు కబ్జా చెరలోకి చేరుతున్నాయి. చెరువు నీరు అలుగు మీదుగా ప్రవహిస్తూ వెళ్లేందుకు నిర్మించిన కాల్వ వెంట ఆక్రమణలు పెరుగుతున్న కారణంగా కుచించుకుపోయి చెరువు నీరు తుపాన్ సమయాల్లో గ్రామంలోకి ప్రవహించి తీవ్ర నష్టం తెచ్చి పెడుతోంది. ఇటీవల సంభవించిన వరదలు ఇందుకు సాక్షీభూతంగా నిలుస్తున్నాయి.
నిడమనూరు : నిడమనూరు మండల కేంద్రంలోని నల్లచౌట చెరువు శిఖంలో అక్రమ ఇళ్ల నిర్మాణం గ్రామానికి ప్రమాదకరంగా దాపురిస్తోంది. శిఖం కాల్వల వెంట ఏటేటా ఆక్రమణల పర్వాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తూ శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో చెరువు ఆనవాళ్లు కనుమరుగు కావడమే కాకుండా గ్రామాన్ని వరదలు ముంచెత్తే పరిస్థితి దాపురించింది. 2013లో తుఫాన్ ప్రభావంతో చెరువుకు గండి పడిన విషయం తెలిసిందే. తదనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మిషన్ కాకతీయ పథకంలో భాగంగా రూ.2.60 కోట్ల వ్యయంతో గండిపూడ్చి వేత, కట్టల బలోపేతం, వెడల్పు, పూడికతీత, కత్వ నిర్మాణ పనులు చేపట్టారు. చెరువుకు ఎగువ నుంచి వరద నీరు పోటెత్తిన సమయంలో వరద నీరు ఇళ్లను ముంచెత్తి తీవ్ర నష్టాన్ని మిగులుస్తోంది. ఇంత జరుగుతున్నా... అధికారులు మాత్రం ఆక్రమణల నివారణకు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. స్థానికుడు డీసీసీబీ డైరెక్టర్ విరిగినేని అంజయ్య నేతృత్వంలో పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకున్న పాపానపోలేదు.
అధికారుల తీరుపై విమర్శలు..
చెరువు పునరుద్ధరణ పనుల్లో భాగంగా గండిపడిన ప్రదేశంలో తూము నుంచి వ్యవసాయ భూములకు సాగు నీరందించే పంట కాల్వ (పైప్ అక్విడెక్ట్)ను నిర్మించారు. సర్వేనెంబరు 374 లో 6.13ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బోదె( కుంట) గతంలో చాలా వెడల్పుగా ఉండేది. పంట కాల్వ సుమారు 600ఎకరాలకు సాగునీరందిస్తోంది. పునరుద్ధరణ పనుల్లో భాగంగా గుత్తేదారు అతితక్కువ వైశాల్యంతో పంట కాల్వను(పైప్ అక్విడెక్ట్) నిర్మించారు. ఈ పరిణామం చెరువు శిఖం ఆక్రమణలకు మరింత దోహదం చేసిందన్న అభిప్రాయం రైతుల నుంచి వ్యక్తమవుతోంది. బోదె వెంట ఉన్న నివాసగృహాల వారు ఏకంగా చెరువులోకి ప్రవేశించి శాశ్వత అక్రమ నిర్మాణాలు చేపట్టిన కారణంగా రూపురేఖలు కోల్పోయింది. అంతకుమించి పంట కాల్వ వెంట ఉన్న నివాసాల వారు కాల్వను ఆనుకుని నిర్మాణాలు చేపట్టడం అధికారుల పనితీరును ప్రశ్నిస్తోంది.
ఆక్రమణలను అడ్డుకోవాలి
చెరువు శిఖం ఆక్రమణల కారణంగా గ్రామానికి వరద ముంపు ప్రమాదం ఏర్పడింది. అలుగు ముందు నుంచి వెళ్లే కాల్వల వైశాల్యం తగ్గిపోయి వరద ఇళ్లలోకి చేరి ఇటీవల తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. పలు మార్లు చిన్న నీటిపారుదల శాఖాధికారులకు విన్నవించినా పట్టించుకోలేదు. అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి
- విరిగినేని అంజయ్య, డీసీసీబీ డైరెక్టర్
చర్యలు తీసుకుంటాం..
బోదె(శిఖం) ఆక్రమణల నివారణకు చర్యలు తీసుకుంటాం. అంచనాలకు అనుగుణంగానే పంట కాల్వ(పైప్ అక్విడెక్ట్)ను నిర్మించాం. శిఖం భూమిలో ఆక్రమణల విషయమై ఉన్నతాధికారులకు సమగ్రంగా నివేదిస్తాం. అక్రమ నిర్మాణాలను పూర్తిగా తొలగిస్తాం.
- ఎస్.వెంకటయ్య, డీఈ
తాజావార్తలు
- కొట్లాటల కాంగ్రెస్ పట్టభద్రులకేం చేస్తుంది..
- కళ్లెదుటే అభివృద్ధి
- నేటి నుంచి చీదెళ్ల జాతర
- ఆ ఊరు.. ఓ ఉద్యానం
- సంత్ సేవాలాల్ త్యాగం చిరస్మరణీయం
- పెట్రో భారం తగ్గించాలంటే ఇలా చేయాల్సిందే: ఆర్బీఐ
- అరకొర పనులు..
- పకడ్బందీగా పట్టభద్రుల ఎన్నికలు
- విదేశీ నిపుణులకు అమెరికా వీసాపై బ్యాన్ విత్డ్రా
- అలాంటి పేరు తెచ్చుకుంటే చాలు!