శుక్రవారం 22 జనవరి 2021
Nalgonda - Dec 03, 2020 , 02:22:17

తోటలకు ప్రోత్సాహం

తోటలకు ప్రోత్సాహం

  • రాయితీలు ప్రకటించిన ప్రభుత్వం
  • జిల్లాలో 500 హెక్టార్లకు గ్రీన్‌సిగ్నల్‌  
  • పండ్లు, కూరగాయల తోటలకూ రాయితీ 
  • వారంరోజుల్లో దరఖాస్తు చేసుకోవాలని రైతులకు సూచన
  • ఇప్పటికే జిల్లాలో 80 వేల ఎకరాల్లో పండ్లు, కూరగాయల సాగు

నల్లగొండ : జిల్లావ్యాప్తంగా ఇప్పటికే పండ్ల, కూరగాయల సాగు గణనీయంగా పెరుగుతుండగా తాజాగా తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీలు ప్రకటిస్తూ మరో 500హెక్టార్లకు సంబంధించి నిధులు విడుదల చేసింది. జిల్లాలో ప్రధానంగా ఇప్పటివరకు పండ్ల తోటల సాగే ఎక్కువగా ఉండగా ఈసారి సైతం పండ్ల తోటలకే ఎక్కువ నిధులు కేటాయించింది. అందులో బత్తాయికి 75హెక్టార్లలో సాగు చేసుకోవాలని సూచించిన సర్కార్‌ ఒక్కో ఎకరాకు రూ.9600 రాయితీ ప్రకటించింది. ఇక అరటికి రూ.30 వేలు, బొప్పాయికి రూ.22 వేలు, మిర్చి, టమాట, వంకాయకు రూ.20 వేలు, ఫాంపాండ్స్‌కు రూ.75 వేలు ప్రకటించిన సర్కార్‌ ఇతర పండ్లు, కూరగాయల తోటలకు భారీగానే రాయితీలు ప్రకటించింది.

ట్రాక్టర్లు, ఇతర యంత్రాలకు సైతం..

ఉద్యానశాఖ పరిధిలో గతంలో ఎప్పుడు లేనంతగా ఈసారి తెలంగాణ ప్రభుత్వం పండ్లు, కూరగాయల సాగును దృష్టిలో పెట్టుకొని సబ్సిడీలు ప్రకటించటంతోపాటు ట్రాక్టర్లు, దానికి సంబంధించిన యంత్రాలకు సైతం సబ్సిడీలు అందజేసింది. 3నుంచి 4లక్షల విలువ చేసే ట్రాక్టర్లలో పెద్ద రైతులకు రూ.75 వేల సబ్సిడీ, చిన్న రైతులకు రూ.లక్ష చొప్పున సబ్సిడీ అందజేస్తుంది. ఎస్సీ, ఎస్టీ రైతులకు సైతం ట్రాక్టర్లు కేటాయించారు. గడ్డి కట్టే యంత్రాలకు సంబంధించి రూ.53 వేల నుంచి 60వేల సబ్సిడీతో కేటాయించారు. అదేవిధంగా ట్రాక్టర్‌కు సంబంధించిన విడి భాగాలకు సైతం రాయితీలను ప్రకటించింది. 

ఇప్పటికే 80వేల ఎకరాల్లో సాగు..

కాలానుగుణంగా పండ్లు, కూరగాయలకు డిమాండ్‌ పెరుగుతుండడంతో ఉద్యానపంటల సాగుసైతం క్రమంగా విస్తరిస్తుంది. జిల్లాలో ప్రస్తుతం 80,840ఎకరాల్లో ఉద్యాన వన పంటలుండగా అందులో 68,212 ఎకరాల్లో పండ్ల తోటలే ఉన్నాయి. వీటిలో ప్రధానంగా బత్తాయి 46,818 ఎకరాల్లో సాగుచేయగా నిమ్మ 15,964, దానిమ్మ 497 ఎకరాల్లో సాగుచేశారు. ఇక కూరగాయలకు సంబంధించి 9729ఎకరాల్లో ఆయా పంటలు సాగువుతుండగా అందులో అత్యధికంగా మిర్చి 1713 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. అంతేగాక అగ్రోఫారెస్టీకి సంబంధించి 336ఎకరాల్లో, శ్రీగంధం, ఎర్రచందనం లాంటి మొక్కలు మరో 180ఎకరాల్లో సాగువుతున్నాయి. ప్రభుత్వం తాజాగా 500 హెక్టార్లకు సంబంధించి రాయితీలు ఇవ్వడంతో మరింత సాగు పెరిగే అవకాశం ఉంది. 

ఉద్యానపంటలకు రాయితీలు 

ప్రభుత్వం 2020-21 సంవత్సానికి సంబంధించి ఉద్యాన పంటలు సాగు చేసుకునే వారికి రాయితీలు ప్రకటించింది. అందులో ప్రధానంగా బత్తాయి, బొప్పాయి, అరటి, మిర్చి, టమాట, వంకాయల సాగుతోపాటు ట్రాక్టర్లు, గడ్డియంత్రాలు, వాటికి సంబంధించిన విడి భాగాలకు సైతం రాయితీలు ఇస్తోంది. అర్హులై ఆసక్తి కలిగిన వారు వారంరోజుల్లో దరఖాస్తు చేసుకోవాలి. 

- సంగీతలక్ష్మి, 

ఉద్యానశాఖ అధికారి, నల్లగొండ


logo