నల్లగొండ: నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ (Nagarjuna Sagar) హిల్‌కాలనీలోని ప్రభుత్వ దవాఖానలో వైద్యం వికటించి 17 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వైరల్ ఫీవర్‌తో బాధపడుతూ చిన్నారులు ఇటీవల దవాఖానాలో చేరారు. రోజూలానే శుక్రవారం సాయంత్రం చిన్న పిల్లల వార్డులో పిల్లలకు వైద్యులు ఇంజక్షన్ ఇచ్చారు. దీంతో అరగంట తర్వాత వారికి చలి, జ్వరం, వాంతులు, విరేచనాలు అయ్యాయి. అర్ధరాత్రి సమయంలో పరిస్థితి విషమించడంతో హాస్పిటల్ సిబ్బంది వారిని ఐసీయూకు తరలించారు.
ప్రస్తుతం బాధితులకు చికిత్స అందిస్తున్నామని డాక్టర్లు వెల్లడించారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నదని తెలిపారు. ఈ ఘటనతో హాస్పిటల్లో తీవ్ర ఆందోళన నెలకొన్నది. ఒక ఇంజక్షన్ బదులు మరొకటి ఇచ్చారని వైద్యులతో తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. వైద్యుల నిర్లక్ష్యంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.