రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యంగా మార్చడానికి ప్రభుత్వం ప్రతి సంవత్సరం మిల్లులకు
అప్పగిస్తుంది. నిర్ణీత గడువు ఇచ్చి సేకరిస్తుంది. సూర్యాపేట జిల్లాలో 2022-23 యాసంగి సీజన్‌కు సంబంధించిన 2,57,849 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) కోసం కొన్ని మిల్లులకు పౌర సరఫరాల శాఖ ఇచ్చింది.
2,09,933 మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించాల్సి ఉండగా ఇప్పటివరకు 1,34,933 మెట్రిక్ టన్నులు వచ్చింది. ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి గడువు ఉండగా మరో 16 రోజుల్లో 75వేల మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉన్నది. కొన్ని మిల్లుల్లో అవకతవకలు జరుగుతున్నట్లు తెలుస్తున్నది. ప్రభుత్వ ఇచ్చిన ధాన్యం విక్రయించుకోగా గడువు ముంచుకొస్తుండడంతో పీడీఎస్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
సూర్యాపేట, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో సీఎంఆర్ అంటే చాలు అటు మిల్లర్లకు, ఇటు అధికారులకు పంట పండేది. ప్రభుత్వం కొనుగోలు చేసే ధాన్యాన్ని మిల్లింగ్ కోసం తీసుకుని ఎగనామం పెట్టడం అనవాయితీగా ఉండె. చాలాచోట్ల మిల్లర్లపై కేసులు నమోదు చేయడం, రీకవరీకి చర్యలు తీసుకోవడం కొనసాగేది. గతంలో ఎగనామం పెట్టిన మిల్లుల నుంచి ఇప్పటికీ జిల్లాలో దాదాపు కోట్లాది రూపాయలు రావాల్సి ఉన్నది.
రెవెన్యూ రీకవరీ యాక్ట్ ప్రకారం ఆస్తులు జప్తు చేయాల్సి ఉన్నప్పటికీ అదికూడా తూతూ మంత్రంగానే కొనసాగుతున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు ఇస్తూ ఐకేపీ, పీఏసీఎస్ లాంటి ప్రభుత్వ సంస్థల ద్వారా కొనుగోలు చేయిస్తున్నది. వాటిని మిల్లింగ్ చేసేందుకు జిల్లాలోని ప్రైవేట్ మిల్లులకు అందజేస్తున్నది. అయితే గడువులోపు ఆయా మిల్లర్లు ధాన్యా న్ని మిల్లింగ్ చేసి నిబంధనల మేరకు బియ్యాన్ని తిరిగి ప్రభుత్వానికి అందజేయాల్సి ఉన్నది.
2022-23 యాసంగిలో జిల్లా వ్యాప్తంగా రైతుల నుంచి 2,57,849 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ ధాన్యాన్ని జిల్లాలోని 59 ఫార్‌బాయిల్డ్, బిన్ని మిల్లులకు మిల్లింగ్ చేసేందుకు ఆయా మిల్లుల సామర్థ్యాన్ని అనుసరించి కేటాయించింది. ఈ ధాన్యాన్ని మిల్లింగ్ చేసిన అనంతరం రా రైస్ అయితే 67 శాతం, బాయిల్డ్ రైస్ అయితే 68 శాతం చొప్పున బియ్యాన్ని తిరిగి ప్రభుత్వానికి అందించాల్సి ఉన్నది. అయితే ఈ ఏడాది సీఎంఆర్ లక్ష్యం చేరుకోవడం కష్టతరమేనని తెలుస్తున్నది.
జిల్లాలో సివిల్ సైప్లె శాఖ ఆధ్వర్యంలో 2,57,849 మెట్రిక్ టన్నుల రా రైస్, బాయిల్డ్ రకం ధాన్యాన్ని ప్రొక్యూర్ చేసి మిల్లులకు పంపించింది. ఈ ధాన్యాన్ని మిల్లింగ్ చేసిన అనంతరం పర్సంటేజీ ప్రకారం ప్రభుత్వానికి 2,09,933 మెట్రిక్ టన్నుల బియ్యం సివిల్ సైప్లె శాఖ సేకరించాల్సి ఉన్నది. అయితే సేకరణకు ఇంకా 16 రోజుల వ్యవధి మాత్రమే ఉండగా 75 వేల మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉన్నదని అధికారుల ద్వారా తెలిసింది.
జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ కోసం తీసుకున్న ధాన్యాన్ని పలు మిల్లుల యాజమాన్యం తెగనమ్ముకున్నట్లు తెలుస్తున్నది. జిల్లాలో 2,57,849 మెట్రిక్ టన్నుల ధాన్యం ఇవ్వగా ఇప్పటి వరకు 10 నుంచి 20 శాతం సీఎంఆర్ మాత్రమే అందించిన మిల్లులు 10కి పైనే ఉండగా 50 నుంచి 60 శాతానికి పైనే సీఎంఆర్ పూర్తిచేసిన మిల్లులు 11 ఉ న్నాయి.
వంద శాతం పూర్తిచేసిన మిల్లులు జిల్లా లో 32 ఉన్నాయి. 2022-23 యాసంగికి సంబంధించిన సీఎంఆర్ పరిస్థితే ఇలా ఉంటే అంతకు మునుపు కూడా జిల్లాలో సుమారు 25కు పైనే మిల్లుల నుంచి వందల కోట్ల రూపాయల సీఎంఆర్ పెండింగ్ ఉన్నట్లు సమాచారం. గత యాసంగికి సంబంధించి మిల్లుల నుంచి బియ్యం తక్కువ ఇచ్చినప్పటికీ జిల్లాలో ఉన్న సివిల్ సైప్లె అధికారులు పట్టించుకోకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రతి ఏడూ మిల్లులకు ఇచ్చిన ధాన్యాన్ని తెగనమ్ముకుని ప్రభుత్వం పేదల కోసం సరఫరా చేస్తున్న పీడీఎస్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి సీఎంఆర్ కింద వాటినే పెడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేదల కోసం ప్రభుత్వం బియ్యం పంపిణీ చేస్తుండగా కొంతమంది దళారులు ఆ బియ్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తుంది.
ఇలా తక్కువ ధరకు సేకరించిన బియ్యాన్నే రీ సైక్లింగ్ చేసి సీఎంఆర్‌గా పెడుతున్నారు. సీజన్లో వచ్చే ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో విక్రయించుకుని సీఎంఆర్ గడువు ముగిసే సమయంలో పీడీఎస్ బియ్యాన్ని సేకరించి అధికారులను మేనేజ్ చేస్తూ లక్ష్యం పూర్తి చేసినట్లుగా చూపిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.