రాజాపేట : రాజాపేట మండల వ్యాప్తంగా 13 చెరువులు, 33 కుంటలు ఎండిపోయాయి. దాంతో భూగర్భ జలాలు రోజురోజుకు అడుగంటి పోతున్నాయి. ఎండలు కూడా దంచి కొట్టుతుండడంతో బోర్లు నీళ్లు పోయడం లేదు. ఆగి ఆగి పోస్తున్నవి సైతం ఎటూ చాలడం లేదు. మండలంలో ఎక్కడ చూసినా కరువు చాయలు కన్పిస్తున్నాయి.
యాసంగి సీజన్లో నీటి ఎద్దడిని ఊహించిన రైతులు వరి సాగు గణనీయంగా తగ్గించారు. గతంలో 22వేల ఎకరాల్లో వరి నాటు పెట్టగా, ఈసారి 16 వేల ఎకరాల్లోనే వేశారు. అయినా ఇప్పటికే 20 శాతానికిపైగా పంటలు ఎండి పోయాయి. పొట్ట దశలో ఎండిన పంటలు పశువులు, జీవాల మేతగా మారుతున్నాయి. ఇంకో 15 రోజులు నీరు అందిస్తే పంట చేతికి వచ్చేదని రైతులు వాపోతున్నారు. ఇప్పుడు పెట్టుబడి తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో కూడా తెలియడం లేదని ఆవేదన చెందుతున్నారు.
నాలుగెకరాలు పశువుల పాలే అయ్యింది
నా పొలం వాగు పకనే ఉంటుంది. గతంలో ఎండ కాలంలోనూ వాగులో నీళ్లు ఉండేవి. ఈ సారి పూర్తిగా ఎండిపోయింది. గత యాసంగిలో పదెకరాలు నాటు పెడితే ఈసారి నాలుగెకరాలే సాగు చేశాను. నాలుగు బోర్లు ఉంటే ఒక్కటీ నీళ్లు పోయడం లేదు. పంటంతా ఎండిపోయింది. ఎండిన చేనును పశువుల మేతకు వదిలిపెట్టాల్సి వచ్చింది.
-గౌర యాదయ్య, రైతు పారుపల్లి, రాజాపేట మండలం
700 ఫీట్లు బోరు వేసినా నీళ్లు పడట్లే
ప్రభుత్వం గోదావరి జలాలతో గొలుసుకట్టు చెరువులను నింపాలి. రాజాపేట మండలంలో భూగర్భ జలాలు ఘోరంగా పడిపోయాయి. 700 ఫీట్ల లోతు బోరు వేసినా నీళ్లు పడడం లేదు. పంటలు పూర్తిగా ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎమ్మెల్యే పట్టించుకోని కాళేశ్వరం వచ్చే నీళ్లతో మల్లగూడెం, రెడ్డిచెరువులను నింపి గొలుసుకట్టు చెరువులన్నింటికీ నీళ్లు ఇవ్వాలి.
-ఎర్రగోకుల జశ్వంత్, రాజాపేట మండల జల సాధన సమితి కన్వీనర్