చివ్వేంల, మర్చి 09 : ఆరుగాలం కష్టపడి యాసంగిలో సాగు చేసిన వరి పొలాలకు ఆదాయం సంగతి పక్కన బెట్టి, ఎంతో కొంత చేతికంది కనీసం పెట్టుబడి పైసలు వచ్చినా చాలు అనుకున్నారు రైతన్నలు. కానీ చివరికి పశువుల మేతకు కూడా పనికి రాకుండా ఎండి పోతుందడంతో అన్నదాతలకు దిక్కుతోచని పరిస్థితి. ఇన్నిరోజులుగా ఎస్సారెస్పి కాల్వకు గోదావరి జలాలు విడుదల చేయకపోవడం, రోజు రోజుకూ ఎండల తీవ్రత అధికమవుతుండడం, ఇప్పటికే చెరువులన్నీ ఎండిపోయి భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు సైతం ఆగి ఆగి పోస్తుండడంతో రైతన్నలు దిక్కు తోచని స్థితిలో పడ్డారు.
సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలంలో ఈ యాసంగి సీజన్లో మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలు, తండాల్లో ఎస్సారెస్పి ఆయకట్టు, దానికి అనుసంధానమైన చెరువుల కింద 24,150 ఎకరాల్లో వరి సాగు చేశారు. అందులో ఇప్పటికే సుమారుగా 1,500 ఎకరాల్లో వరి పూర్తిగా ఎండిపోయింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఎస్సారెస్పి ద్వారా నీళ్లు అందించకపోతే మరో నాలుగైదు వేల ఎకరాల్లో వరి చేతికందని పరిస్థితి నెలకొంది. 2018 నుంచి 2023 వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగు నీళ్లు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి. కాగా ఈ ఏడాది యాసంగి పంటలు పూర్తిగా ఎండిపోయి భారీగా నష్ట పోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. చాలా గ్రామాల్లో ఇప్పటికే పొట్ట దశలో ఉన్న వరి పొలాలు చేతికందకుండా పోయాయి. ఈ ఏడు సాగునీళ్లతో పాటు తాగు నీళ్లకు సైతం తిప్పలు తప్పవని రైతులు గోడు వెళ్లబోస్తున్నారు.
Srsp Water : కాల్వ పక్కనే ఉంది.. పదకొండు ఎకరాలు ఎండింది
మండలంలోని వల్లభాపురం ఆవాసం జగన్నాయక్ తండా శివారులో గత ఎస్సారెస్పీ కాల్వను ఆనుకుని ఉన్న 11 ఎకరాల భూమిని రైతు బానోతు పాండు కౌలుకు తీసుకుని సాగు చేశాడు. కాల్వ పక్కనే పొలం ఉన్నప్పటికీ చుక్క నీరు అందే పరిస్థితి లేక పొలం ఎండిపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఇప్పుడు నీళ్లను వదిలింది. ఈ నీళ్లే 20 రోజుల కిందే ఇస్తే తన పొలం బతికి చేతికందేదని తెలిపాడు. ఇప్పుడు వస్తున్న నీళ్లు కాల్వకే తడిఆరే పరిస్థితి లేదన్నాడు. ఇప్పటికే రూ.4 లక్షలు అప్పు అయినట్లు తెలిపాడు. పొలం యజమానికి కౌలు చెల్లించక తప్పదని, సాగుకు తెచ్చిన అప్పులు ఎట్లా కట్టాలో తెలియని దిక్కుతోచన స్థితిలో ఉన్నట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులను ఆదుకుని న్యాయం చేయాలని వేడుకుంటున్నట్లు కోరాడు.
Srsp Water : కాల్వ పక్కనే ఉంది.. పదకొండు ఎకరాలు ఎండింది