చిట్యాల, జూలై 7: మండలంలోని వెలిమినేడు గ్రామ శివారులో గురువారం సాయంత్రం బోల్తా పడిన కారులో గంజాయి లభించిన విషయం విదితమే. అయితే 104 కిలోల గంజాయి పట్టుబడిందని దాని విలువ రూ.20.18 లక్షలు ఉంటుందని డీఎస్పీ నర్సింహారెడ్డి తెలిపారు. చిట్యాల పోలీస్‌స్టేషన్‌లో సీఐ మహేశ్, ఎస్ఐ రవితో కలిసి శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. హైదరాబాద్ షేక్‌పేట్ సమీపంలోని సీతానగర్ కాలనీ చెందిన గుంటి సాయి వరుణ్, తనుజ్‌కు గంజాయి తీసుకునే అలవాటు ఉంది. స్థానికంగా లభించే గంజాయిలో నాణ్యత లేకపోవడంతో ఇరువురు సాయివరుణ్ తనకు తెలిసిన టిల్లు అనే ద్వారా ఛత్తీస్‌గడ్‌లోని కుంట గ్రామానికి చెందిన మోహన్ అనే వ్యక్తి దగ్గర క్వాలిటీ గంజాయి లభిస్తుందని తెలుసుకున్నాడు. ఈ నెల 5న సాయి వరుణ్, అనుజ్ కారును అద్దెకు తీసుకొని భద్రాచలం మీదుగా ఛత్తీస్‌గడ్‌లోని కుంట గ్రామానికి వెళ్లి మోహన్‌కు ఫోన్ చేశారు.
అక్కడ బైక్‌లపై వచ్చిన మోహన్ ఆయన బావమరిది మల్లికార్జున్ వద్ద 104 కిలోల గంజాయిని రూ.10 వేలకు సాయి వరుణ్, అనుజ్లకు కొనుగోలు చేసి కారు డిక్కీలో నింపుకున్నారు. అనంతరం మరో 100 కిలోల గంజాయిని మోహన్, మల్లికార్జున్ హైదరాబాద్ పటాన్‌చెరువులోని ఓ హోటల్ వద్ద ఓ వ్యక్తి అమ్ముతామని చెప్పి కారులో వస్తామని నలుగురి హైదరాబాద్‌కు బయల్దేరారు. ఈ నెల 6న మార్గమధ్యంలో వెలిమినేడు గ్రామ శివారులోని సాయి వరణ్ నిద్రమత్తులోకి జారుకోవడంతో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన పల్టీ కొట్టింది. దాంతో సాయి వరుణ్ తీవ్రగాయాలతో అందులో ఇరుక్కుపోగా మిగతా ముగ్గురు పరారయ్యారు.పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి గాయపడిన సాయి వరుణ్ చికిత్స కోసం నార్కట్‌పల్లి కామినేని దవాఖానకు తరలించారు. చికిత్స అనంతరం స్టేషన్‌కు తీసుకొచ్చి అరెస్ట్ చేసి నల్లగొండలో కోర్టులో హాజరుపర్చినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో పోలీస్ సిబ్బంది ఉన్నారు.