యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 15 : పవిత్ర పుణ్య క్షేత్రమైన యాదగిరిగుట్ట పట్టణంలో 100 పడకల సర్కార్ దవాఖాన నిర్మాణానికి నేడు అంకురార్పణ జరుగనుంది. యాదగిరిగుట్ట మండలంలోని సైదాపురం గ్రామ సర్వే నంబర్ 329లో ఆరెకరాల భూమిని కేటాయించగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ సునీతామహేందర్‌రెడ్డి నిర్మాణ పనులకు గురువారం శంకుస్థాపన చేయనున్నారు. పట్టణాలు, పల్లెల దవాఖానలు వైద్యాలయాలుగా మారలన్న సీఎం కేసీఆర్ సంకల్పంతో యాదగిరిగుట్ట పీహెచ్సీ అప్‌గ్రేడ్ చేస్తూ ఏరియా ఆస్పత్రిగా మార్చారు.
గతేడాది నవంబర్ 29న 100 పడకల ఏరియా ఆస్పత్రిగా నవీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తూ ఇందుకోసం రూ.45.79కోట్లు మంజూరు చేసింది. జీ ప్లస్-2తో అత్యాధునికంగా ఆస్పత్రి భవనాన్ని నిర్మించనున్నారు. గతంలో 6 పడకలతో సేవలందిస్తున్న పీహెచ్సీ త్వరలో 100పడకల ఏరియా ఆస్పత్రిగా మారి యాదగిరిగుట్ట పట్టణంతో పాటు పరిసర ప్రాంత ప్రజలకు సేవలు అందించనుంది. ప్రస్తుతం డైరెక్టర్ ఆఫ్ ఆరోగ్యం శాఖ కింద పనిచేసే ప్రస్తుత పీహెచ్సీ ఇక నుంచి రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కింద పనిచేయనుంది.
భక్తులకు సైతం సేవలు
పూర్తి కృష్ణ శిలలతో నిర్మితమైన యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ప్రపంచమే అబ్బుపరపడేలా రూపుదిద్దుకున్నది. రోజుకు వేలాది మంది భక్తులు స్వామి దర్శనానికి వస్తున్నారు. గతంతో పొలిస్తే భక్తులు సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. దీంతో యాదగిరిగుట్ట ప్రాంతమంతా ప్రతినిత్యం భక్తులు సందడిగా మారుతున్నది. ఈ నేపథ్యంలో ఇక్కడి వచ్చిన భక్తులకు ఆరోగ్య పరమైన సేవలు అందించడంతో పాటు యాదగిరిగుట్ట పట్టణం, చుట్టుపక్కల రాజాపేట, మోటకొండూర్, ఆలేరు, తుర్కపల్లి, బొమ్మలరామారంతో పాటు పక్కనే ఉన్న భువనగిరి మండలంలోని పలు గ్రామాలకు సత్వరమే సేవలు అందించేందుకు ప్రభుత్వం పూనుకున్నది.
ఈ నేపథ్యంలో 6పడకలతో ఉన్న పీహెచ్‌సీని 100 పడకల ఏరియా ఆస్పత్రిగా నవీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు కావాల్సిన వసతుల నిమిత్తం రూ.45.79కోట్ల నిధులు మంజూరుకాగా ఇందు లో నాన్ రికరింగ్ వ్యయం కింద రూ.35.95 కోట్లు, రికరింగ్ వ్యయం కింద రూ.9.84 కోట్లు మంజూరు చేస్తూ జీఓ నంబర్ 722 ఉత్తర్వును ప్రభుత్వం గతేడాది నవంబర్ 29న విడుదల చేసింది. 100 పడకల ఏరియా ఆస్పత్రిగా మారనున్న యాదగిరిగుట్ట ప్రభుత్వాసుపత్రి రాష్ట్ర వైద్యవిధాన పరిషత్ నేతృత్వంలో 24గంటల పాటు అన్ని విభాగాల సేవలు అందించనున్నది.
జీ ప్లస్ 2తో అత్యాధునిక భవనం
సైదాపురంలోని సర్వే నంబర్ 329లో ఆరెకరాల్లో గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మరో రెండు ఫ్లోర్లలో అత్యాధునిక భవనాన్ని నిర్మించనున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో డయాలసిస్ కేంద్రం, ఐసీయూ, ఓపీ బ్లాక్, ఐపీ బ్లాక్, మాతాశిశు కేంద్రం, మొదటి ఆంతస్తులో ఆడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, రేడియాలజీ విభాగం, సెంట్రల్ ల్యాబ్, వార్డులు, రెండో అంతస్తులో ఆపరేషన్ థియేటర్, ఎస్ఎన్సీయూ చిన్న పిల్లలకు ప్రత్యేక వార్డు, ఐపీ వార్డులతో పాటు అదనంగా మార్చరీ బ్లాక్‌ను నిర్మిస్తారు. ప్రతి బ్లాక్ 2,600ఫీట్ల విస్తీర్ణంలో ఉండనుంది. దీంతో పాటు వైద్యాధికారులు సంఖ్య పెంపుతో 24 గంటల పాటు వైద్యం అందుబాటులోకి రానున్నది.