సూర్యాపేట, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ప్రగతి విప్లవం కొనసాగుతున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని పాలన ప్రస్తుతం దేశానికి మార్గదర్శనంగా మారిందన్నారు. మంగళవారం సూర్యాపేటలో బీఆర్ఎస్ నియోజకవర్గ ప్లీనరీ ప్రారంభానికి ముందు అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాల వేశారు. పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వర్తమానానికి స్ఫూర్తిదాయకంగా నిలిచే రీతిలో 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతోపాటు సచివాలయానికి అంబేద్కర్ పేరును పెట్టడంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశం గర్వించే రీతిలో భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని నెలకొల్పడం జాతి గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. నూతన సచివాలయానికి అంబేద్కర్ మహాశయుడి పేరు పెట్టడం దేశ చరిత్రలోనే చారిత్రాత్మకమని అభివర్ణించారు. దళితుల్లో ఆర్థిక అసమానతలు తొలగించేందుకే దలితబంధ పథకాన్ని ప్రారంభించారని వెల్లడించారు. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా రూపొందించడం ద్వారా గిరిజన సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని కొనియాడారు.
2014 తర్వాతే అభివృద్ధి, సంక్షేమం
అసలు అభివృద్ధి, సంక్షేమం గురించి చెప్పాలంటే 2014 ముందు, 2014 తరువాత అన్న పద్ధతిలో చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయన్నారు. 2014కు ముందు తెలంగాణ ప్రాంతంలో కేవలం 60 లక్షల ఎకరాలు మాత్రమే సేద్యానికి నోచుకోగా 2021-21 నాటికి కోటి 35 లక్షల ఎకరాలు సేద్యానికి వచ్చిందంటే అది ముమ్మాటికీ సీఎం కేసీఆర్ ఘనత మాత్రమేనని ఆయన తేల్చిచెప్పారు. చరిత్రలో నిలిచిపోయేలా కాళేశ్వరం ప్రాజెక్టును ఆవిష్కరించిన ఇంజినీరు ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాఆరు. అన్నింటికీ మించి యావత్ దేశంలోనే వ్యవసాయానికి 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. అభివృద్ధి, సంక్షేమం జోడెడ్ల మాదిరిగా పరుగులు పెడుతుండడంతో అన్ని రంగాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని మంత్రి పేర్కొన్నారు.
కేంద్రంపై విరుచుకుపడ్డ మంత్రి
తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నీ సమకూర్చుతుంటే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలంగాణపై విషం చిమ్ముతుందంటూ కేంద్రంపై మంత్రి జగదీశ్‌రెడ్డి విరుచుకుపడ్డారు. రాష్ట్ర విభజన తరువాత అధికారంలోకి వచ్చిందే తడవుగా మోదీ సర్కార్ తెలంగాణపై విషం చిమ్ముతుందని మండిపడ్డారు. మిషన్ భగీరథకు 24వేల కోట్లు ఇవ్వాలని నీతి అయోగ్ సిఫారసు చేసినా కేంద్రం తెలంగాణకు మొండిచెయ్యి చూపిందని విమర్శించారు. యేటా రెండు కోట్ల ఉద్యోగాలంటూ నిరుద్యోగ యువతను మోసం చేసిన బీజేపీకి విద్యార్థి, యువత గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి మాజీ సభ్యుడు ఒంటెద్దు నర్సింహారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వై. వెంకటేశ్వర్లు, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్య యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, చివ్వెంల బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జూలకంటి జీవన్‌రెడ్డి, పెన్‌పహాడ్ అధ్యక్షుడు దొంగరి యుగంధర్, సూర్యాపేట అధ్యక్షుడు వంగాల శ్రీనివాసరెడ్డి, ఆత్మకూర్.ఎస్ అధ్యక్షుడు తూడి నర్సింహారావు, ఎంపీపీలు ధరావత్ కుమారీబాబూనాయక్, నెమ్మాది భిక్షం, బీరవోలు రవీందర్‌రెడ్డి, మర్ల స్వర్ణలతాచంద్రారెడ్డి, జడ్పీటీసీలు భూక్యా సంజీవ్‌నాయక్, జీడి భిక్షం, మామిడి అనిత, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, జిల్లా నాయకులు గండూరి ప్రకాశ్, పూర్ణ శశికాంత్, జుట్టుకొండ సత్యనారాయణ, చందుపట్ల పద్మయ్య పాల్గొన్నారు.
22 తీర్మానాలు ఆమోదం..
ప్లీనరీ సమావేశంలో 22 తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపనతోపాటు సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టినందుకు సీఎం కేసీఆర్‌ను అభినందిస్తూ మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణమ్మ తీర్మానం ప్రవేశపెట్టగా పెన్‌పహాడ్ ఎంపీపీ నెమ్మాది భిక్షం ఆమోదించారు. వ్యవసాయ అభివృద్ధి, రైతు సంక్షేమంపై రాష్ట్ర ఉన్నత విద్యామండలి మాజీ సభ్యుడు ఒంటెద్దు నర్సింహారెడ్డి ప్రతిపాదనకు జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్ బలపర్చారు. మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటున్న అంశంపై బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు ప్రతిపాదించగా పూర్ణ శశికాంత్ బలపర్చారు.
సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
చివ్వెంల : అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. గత ప్రభుత్వాలు తెలంగాణకు చేసిందేమీ లేదని, రాష్ట్రం ఏర్పడ్డాకే సీఎం కేసీఆర్ అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ లక్షల ఎకరాలకు ఎస్సారెస్పీ నీళ్లు అందించారని, జిల్లాకు సాగు నీళ్లు తీసుకొచ్చిన ఘనత మన మంత్రి జగదీశ్‌రెడ్డికే దక్కిందన్నారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ప్రజలకు ముఖం చూపించే అర్హత కోల్పోయారన్నారు. రాబోయే ఆరు మాసాలు కీలకమని, మన ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రాష్ట్రంలో హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్‌ను, జిల్లా అభివృద్ధి ప్రదాత జగదీశ్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామన్నారు.