శుక్రవారం 07 ఆగస్టు 2020
Nagarkurnool - Mar 30, 2020 , 02:11:16

పటిష్టంగా లాక్‌డౌన్‌

పటిష్టంగా లాక్‌డౌన్‌

  • పది దాటితే బయటకు రాని జనం
  • విస్తృతంగా పర్యటిస్తున్న అధికారులు, పోలీసులు

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా వ్యాప్తంగా ‘లాక్‌డౌన్‌' పటిష్టంగా కొనసాగుతున్నది. కరోనా వైరస్‌ విస్తరించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు వారం రోజులుగా ఇండ్ల నుంచి బయటికి రావడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించడంతో ప్రజల్లో చైతన్యం పెరుగుతున్నది. నిత్యావసరాలకు ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

మహబూబ్‌నగర్‌, నమస్తే తెలంగాణ : కరోనా వైరస్‌ నివారించేందుకు ప్రజల్లో చైతన్యం పెరుగుతున్నది. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి నిర్ణీత సమయంలో ఉదయం 10 గంటల వరకు వారికి అవసరమైన నిత్యావసరాల సరుకులు తీసుకొని ఇండ్లకే పరిమితం అయ్యారు. మటన్‌, చికెన్‌ దుకాణాల వద్ద ప్రజలు ఉదయం నుంచి బారులుతీరారు. గత వారం రూ.70లకు పలికిన చికెన్‌ ధర రూ.180కి చేరింది. ఒక్కో షాపు వద్ద చికెన్‌ తీసుకోవడానికి సుమారు అరగంట సమయం పట్టింది. అదేవిధంగా ప్రభుత్వ జనరల్‌ దవాఖాన వద్ద మటన్‌ మార్కెట్‌కు ప్రజలు భారీగా తరలొచ్చారు. గతవారం కిలో రూ. 600 పలికిన మటన్‌ ధర రూ. 800లకు చేరడం గమనార్హం. కూరగాయల షాపుల వద్ద రద్దీ పెరుగవద్దనే ఉద్దేశంతో అధికారులు మరిన్ని ప్రాంతాల్లో రైతులతో కూరగాయల దుకాణాలు ఏర్పాటు చేయించారు. దీంతో రద్దీ తగ్గింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రధాన కూడళ్ల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు మైక్‌ల ద్వారా అవగాహన కల్పిస్తూ జనం బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా సుదూర ప్రాంతాల నుంచి తిరిగి వస్తున్న వలస కూలీలకు కాలినడకే శరణ్యమైంది. ఆదివారం కూడా జడ్చర్ల నుంచి పిల్లాపాపలతో కూలీలు పాలమూరుకు కాలినడకన తరలిరావడం కనిపించింది.

‘పేట’లో పకడ్బందీగా..

నమస్తే తెలంగాణ ప్రతినిధి, నారాయణపేట : కరోనా వైరస్‌ నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌ ఆదివారం నారాయణపేట జిల్లా వ్యాప్తంగా పకడ్బందీగా కొనసాగింది. ప్రజలు అత్యవసరమైతే తప్పా ఇండ్ల నుంచి ఎవరూ బయటకు రావడం లేదు. పోలీసులు సైతం ఉదయం 10 గంటల తర్వాత వచ్చిన వారిని ఇండ్లకు తిప్పి పంపిస్తున్నారు. లాక్‌డౌన్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు, పోలీసులు గ్రామాలల్లో విస్తృతంగా పర్యటించారు. జిల్లా కేంద్రంలో పెట్రోల్‌ బంక్‌ల వద్ద రద్దీ ఎక్కువగా ఉండడంతో ఎస్పీ ఆదేశాల మేరకు బంకుల వద్ద నిర్ణీత దూరం పాటించేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు.  నారాయణపేట జిల్లా కేంద్రంలోని రైతు బజారును అగ్నిమాపక యంత్రాలచే శుభ్రపరిచారు. మరికల్‌లో ఇతర గ్రామాలకు కాలినడకన వెళ్తున్న బాటసారులు, విధులు నిర్వహిస్తున్న అధికారులకు జువెల్లరీ షాపు యజమాని రమేశ్‌ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సరిహద్దు ప్రాంతాలలో చెక్‌పోస్ట్‌ల వద్ద అదనపు బలగాలను ఏర్పాటు చేసి పోలీసులు వాహనాలను అడ్డుకున్నారు .  అదేవిధంగా జిల్లాలోకి ఇతర దేశాలు, రాష్ర్టాల నుంచి వచ్చిన వారి వివరాలను ఆశ వర్కర్లు సేకరిస్తున్నారు. ఆదివారం సాయంత్రం వరకు ఇతర దేశాల నుంచి జిల్లాకు 37 మంది, ఇతర రాష్ర్టాల నుంచి 411మంది, వివిధ జిల్లాల నుంచి 1938 మంది వచ్చినట్లు ఆశ వర్కర్లు గుర్తించారు. 

నాగర్‌కర్నూల్‌లో నిరంతరం నిఘా

నాగర్‌కర్నూల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : నాగర్‌కర్నూల్‌ జిల్లాలో లాక్‌డౌన్‌ విజయవంతంగా అమలవుతున్నది. ప్రజలు ఆయా గ్రామాల్లో ముళ్ల కంచెలు అడ్డంగా వేసి స్వీయ దిగ్బంధాన్ని పాటిస్తున్నారు. కలెక్టర్‌ శ్రీధర్‌ నిత్యం లాక్‌డౌన్‌, వైద్యసేవలపై పర్యవేక్షిస్తున్నారు. నాగర్‌కర్నూల్‌తోపాటు కొల్లాపూర్‌, ఆమ్రాబాద్‌ ప్రాంతాలలో క్వారంటైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితోపాటు ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్‌ నియోజకవర్గాల్లోనే ఉంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. 

వనపర్తిలో ఇబ్బందులు లేకుండా..

వనపర్తి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కరోనా వ్యాపించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్నది. ఇదే సందర్భంలో వివిధ రకాల నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా ఇదివరకే కిరాణా షాపులను పరిశీలించి తగు సూచనలు చేశారు. స్థానిక డీఎస్పీ కేఎం కిరణ్‌కుమార్‌, సీఐ సూర్యానాయక్‌ల ఆధ్వర్యంలో పట్టణంలో లాక్‌డౌన్‌ అమలుకు కఠినంగానే వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా జిల్లా కేంద్రంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆదివారం కూరగాయల విక్రయాలను స్వయంగా పరిశీలించారు. ప్రతి ఒక్కరూ స్వీయ రక్షణకు ప్రాధాన్యతనిచ్చేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులు ప్రజలకు పిలుపునిచ్చారు.

ఎక్కడికక్కడా అవగాహన

జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లా వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విజయవంతంగా కొనసాగుతున్నది. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుధ్య పనులు ముమ్మరం చేశారు. కౌన్సిలర్లు తమ వార్డుల్లో మున్సిపల్‌ కార్మికులతో ఫాగింగ్‌, బ్లీచింగ్‌ పౌడర్‌ను చల్లించారు. కలెక్టర్‌ శ్రుతిఓఝా ప్రజలు గుంపులుగా లేకుండా తగిన చర్యలు చేపట్టారు. నిత్యావసర వస్తువులు కూరగాయలు, కిరాణా సామగ్రి కోసం వచ్చే వారు నిర్ణీత దూరం పాటించాలని అవగాహన కల్పిస్తున్నారు. అలంపూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ వీఎం అబ్రహం పుల్లూరు చెక్‌పోస్ట్‌ వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రంలోకి ఎవరినీ అనుమతించకూడదని ఆదేశించారు. 


logo