సిద్దిపేట, మార్చి 1: పొద్దు తిరుగుడు కొనుగోలు కేంద్రాలతో రైతులకు మేలు జరుగుతుందని జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ అన్నారు. శుక్రవారం సిద్దిపేట మార్కెట్ యార్డులో పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఏడు చోట్ల పొద్దుతిరుగుడు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హుస్నాబాద్, కటూరు, బెజ్జంకి, తొగుట, సిద్దిపేటలో స్థానిక ప్రజాప్రతినిధులు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారన్నారు. మిగిలిన కేంద్రాలు గజ్వేల్, చిన్నకోడూరులలో రెండు రోజుల్లో ప్రారంభమవుతాయన్నారు. క్వింటాలు పొద్దుతిరుగుడుకు రూ.6,760 ఉండగా బహిరంగ మారెట్లో రూ.4,000 నుంచి 4,500 వరకు మాత్రమే ఉన్నదన్నారు.
రైతులు నష్టపోకుండా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుతో పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై మాట్లాడడంతో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో సిద్దిపేట జిల్లాలో నీటి కొరత లేకుండా పోయిందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వేలేటి రాధాకృష్ణశర్మ, సిద్దిపేట రూరల్ ఎంపీపీ శ్రీదేవీచందర్రావు, పీఏసీఎస్ చైర్మన్ నరేందర్‌రెడ్డి, పీఏసీఎస్ సీఈవో కృష్ణ, ఏఎంసీ సెక్రటరీ వెంకటయ్య, డీఎం మార్ఫెడ్ క్రాంతి, మార్ఫెడ్ ఎంఈ లక్ష్మణ్, హమాలీ కార్మికులు, రైతులు, సిబ్బంది పాల్గొన్నారు.