పుల్కల్, సెప్టెంబర్ 6: సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని ముదిమాణిక్యం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రమాదం అంచుకు చేరింది. ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పాఠశాల గదుల్లోకి నీళ్లు చేరాయి. పురాతన బిల్డింగ్ కావడంతో స్లాబ్ మొత్తం బీటలుబారి వర్షపు నీళ్లు క్లాస్ రూంలోకి వచ్చి అక్కడి నుంచి బయటకు వస్తున్నాయి.
విద్యార్థులు బిక్కుబిక్కు మం టూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పాఠశాలకు వస్తున్నారు. ఎప్పుడు పాఠశాల కూలిపోతుందనే భయం విద్యార్థుల్లో పట్టుకుంది. పాఠశాలకు వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాల గదులు, నీళ్లు లోపలికి వస్తున్న తీరును గమనించి వెం టనే పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విఠల్ డీఈవో వెంకటేశ్వర్లుకు సమాచారం అం దించారు. దీంతో పాఠశాలకు సెలవు ప్రకటించి విద్యార్థులను ఇంటికి పంపించాలని ఆదేశాలు జారీ చేయడంతో వారిని ఇంటికి పంపించారు.
పాఠశాల భవనం నిర్మించి 70 ఏండ్లు గడిచి పోవడంతో ఈ పరిస్థితి ఎదురైనట్లు గ్రామస్తులు వాపోతున్నారు. ఇలాగైతే మా పిల్లల భవిష్యత్ ఎలా అని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు పరిశీలించి తగు చర్యలు తీసుకొని పిల్లల చదువులకు ఆటంకం కలుగకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.
01
వర్షాలు పడ్డ ప్రతీసారి విద్యార్థులతోపాటు మేము కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం. పురాతన భవనం కావడంతో స్లాబ్ పెచ్చులూడి క్లాస్‌రూమ్‌లో పడుతున్నాయి. వర్షపు నీరంతా గదుల్లో పారు తుంది. అందుకే విద్యార్థులను ఆరుబయట కూర్చో బెడుతున్నాం.
– అజిత్ ప్రసాద్, ఉపాధ్యాయుడు, ముదిమాణిక్యం జడ్పీహెచ్ఎస్
వర్షం పడ్డప్పుడు పాఠశాల గదులన్నీ నీటితో తడుస్తున్నాయి. చేసేదేమి లేక విద్యార్థులకు ఆరు బయటనే పాఠాలు బోధిస్తున్నాం. ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి దృష్టికి తీసుకువెళ్లాం. జిల్లా అధికారులు స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలి.
– అశోక్ కుమార్, ఉపాధ్యాయుడు, ముదిమాణిక్యం జడ్పీహెచ్ఎస్
ప్రభుత్వ పాఠశాల బిల్డింగ్ బీటలు వారింది. దాంతో నీళ్లన్నీ క్లాస్ రూంలోకి వస్తున్నాయి. మా పిల్లలను పాఠశాలకు పంపాలంటేనే భయమేస్తోంది. జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే గ్రామానికి నూతన పాఠశాల భవనం మంజూరు చేసి నిర్మాణం చేపట్టాలి.
– మ్యాతరి బాల్‌రాజ్, విద్యార్థి తండ్రి