మెదక్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు కేవలం 600 మంది రైతుల నుంచి 3059.24 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ఈ ధాన్యం విలువ రూ.6.74 కోట్లు మాత్రమే. ఇందులో కేవలం రూ.24 లక్షల డబ్బులు మాత్రమే రైతులకు చెల్లించారు. జిల్లాలో మొత్తం 410 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేశారు. కానీ, కొనుగోలు కేంద్రాల్లో ఇంకా పూర్తిస్థాయిలో కాంటాలు కావడం లేదు. వాతావరణంలో మార్పులతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కుప్పలు కుప్పలుగా దర్శనమిస్తున్నది.
ఇదే అదునుగా భావించిన దళారులు ధాన్యాన్ని తక్కువ ధరకు కొంటున్నారు. ప్రభుత్వం క్వింటాలు ధాన్యానికి రూ.2,203 మద్దతు ధర నిర్ణయించగా, దళారులు మాత్రం రూ.2,050 పెట్టి కొంటున్నారు. 50 కిలోలకు 2 కిలోల ధాన్యాన్ని తరుగు తీస్తున్నారు. క్వింటాల్‌కు 4 కిలోల వడ్లతోపాటు మద్దతు ధర కంటే రూ.153 తక్కువ చెల్లిస్తున్నారు. పది రోజుల్లో డబ్బులిస్తామని చెప్పి, రోజులు గడుపుతూ నెల రోజుల వరకు రైతులకు డబ్బులు చెల్లించడంలేదు. కొనుగోలు కేంద్రాల వద్ద 17 తేమ శాతంతో వడ్లను కొనుగోలు కేంద్రాల్లో తూకం వేస్తున్నా, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో కుమ్మక్కై రైస్‌మిల్లర్లు 40 కిలోల బస్తాకు 2.5 కిలోల వడ్లను అదనంగా ప్రతి క్వింటాలుకు 5 కిలోల తరుగును తీస్తున్నారు.
జిల్లావ్యాప్తంగా వరి కోతలు జోరందుకున్నాయి. ఎక్కడి వడ్లు అక్కడే ఉన్నాయి. ఈ సీజన్లో 4.20 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. వరి కోతలు మొదలైనా కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి కానందున వడ్ల కుప్పలు ఎక్కడికక్కడే ఉన్నాయి. తూకం వేసి రవాణా చేసే దాకా రైతులకు తిప్పలు తప్పడంలేదు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం క్షేత్ర స్థాయిలో జరుగుతున్న మోసాలు, అక్రమాలను అరికట్టాలని రైతులు కోరుతున్నారు.
జిల్లాలో 410 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఏ ఒక్క కొనుగోలు కేంద్రంలో టెంట్లు, తాగునీటి వసతి, కూలీల కోసం షెడ్డు ఏర్పాటుచేయలేదు. ఎండలు మండిపోతుండడంతో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. సౌకర్యాలు కల్చించక పోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. 1.05 కోట్ల గన్నీ బస్తాలు అవసరం ఉండగా, 47.46 లక్షల బస్తాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
నిజాంపేట, ఏప్రిల్ 18: నిజాంపేట మండల వ్యాప్తంగా బుధవారం రాత్రి బలమైన ఈదురు గాలులతో కురిసిన వర్షానికి చేతికొచ్చిన పంట నేలకొరిగింది. కొనుగోలు కేంద్రాల వద్దకు ధాన్యం తడిసిపోయింది. అడుగంటిన భూగర్భజలాలు, కరెంట్ సమస్యలు, అకాల వర్షాలతో రైతులు నష్టల బారిన పడుతున్నారు.