Wrestling competitions | టేక్మాల్, మార్చి 22 : ప్రతీ యేటా హోళీ పండుగ అనంతరం మండల కేంద్రమైన టేక్మాల్‌లో దుర్గమ్మ, పోచమ్మ జాతర ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా నాలుగవ రోజైన శనివారం కుస్తీపోటీలను నిర్వహించారు. ఈ పోటీలకు ఉమ్మడి మెదక్ జిల్లాతోపాటు నిజామాబాద్, కామారెడ్డి అలాగే పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో మల్లయోధులు పోటీల్లో పాల్గొనేందుకు వచ్చారు.
మధ్యాహ్నాం నుంచి సాయంత్రం వరకు హోరా హోరీగా కుస్తీ పోటీలు జరిగాయి. ఒకరిని మించి ఒకరు మల్లయోధులు తలపడుతుండటంతో ఎవరు గెలుపొందుతారో అని చూసేవారిలో ఉత్కంఠ నెలకొంది. రూ.100 నుంచి ప్రారంభమైన కుస్తీ పోటీలు వెండి కడెంతో ముగిశాయి. కుస్తీ పోటీలో గెలుపొందిన మల్లయోధులకు నిర్వాహకులు బహుమతులను అందజేశారు.
కర్ణాటక రాష్ట్రం చించోలి ప్రాంతానికి చెందిన హనుమంతు ఫైనల్ విజేతగా నిలిచి వెండి కడియాన్ని గెలుపొందాడు. అతనికి ఎస్సై రాజేష్ చేతుల మీదుగా వెండి కడియాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో టేక్మాల్ ఈవో రాకేష్ కుమార్, నాయకులు భక్తుల వీరప్ప, కమ్మరి సిద్దయ్య, నిమ్మ రమేష్, ఆకుల పల్లి పాపయ్య, చింత రవి, వడ్ల గోవిందాచారి, ఎల్లుపేట రాజు, ప్రవీణ్ కుమార్, వెంకటేష్ తదితరులు ఉన్నారు.
Hyderabad | ఎస్టీ హాస్టల్లో పురుగుల అన్నం.. రోడ్డెక్కిన విద్యార్థులు