పటాన్చెరు, జూలై 2 : రసాయన పరిశ్రమల్లో రియాక్టర్ల పర్యవేక్షణకు తగిన అనుభవం, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఆపరేటర్లను నియమించక పోవడంతో తరుచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. పరిశ్రమల్లో సైంటిఫిక్ ఇంజినీర్లు రియాక్టర్ల వద్ద ఉష్ణ్ణోగ్రతలు పరిశీలించాల్సి ఉంటుంది. రియాక్టర్ పనితీరు, ఉష్ణ్ణోగ్రతల హెచ్చుతగ్గులు పరిశీలించి ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.రియాక్టర్‌కు ప్రమాదం ఉంటే కార్మికులను అప్రమత్తం చేసేందుకు అలారం(సెక్యూరిటీ అలారం) ఏర్పాటు చేయాలి.
రసాయన పరిశ్రమల్లో యాజమాన్యాలు రియాక్టర్ వద్ద ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. రియాక్టర్ల వద్ద అనుభవం ఉన్న కార్మికులను ఉంచడం లేదు. రసాయన పరిశ్రమల్లో పనిచేసే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రసాయన పరిశ్రమల్లోని రియాక్టర్ల వద్ద అనుభవం లేని కార్మికులను నియమించడంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని నిపుణులు తెలుపుతున్నారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని పాశమైలారం పారిశ్రామికవాడలో ఉన్న సిగాచి రసాయన పరిశ్రమలో అనుభవం లేని కార్మికులు రియాక్టర్ వద్ద పనిచేయడంతోనే ప్రమాదం జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. చాలా పరిశ్రమల యాజమాన్యాలు తక్కువ జీతానికి కార్మికులను కుదుర్చుకుని పనులు చేయిస్తున్నాయి.సిగాచి రసాయన పరిశ్రమలో ఎక్కువ మంది అనుభవం లేని కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారని తెలిసింది. ఎక్కువ మంది బీహారు, ఒడిశా, యూపీ, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కార్మికలు పని చేసేవారని సమాచారం.
అడ్మినిస్ట్రేషన్‌లో కొందరు అనుభవం ఉన్న ఉద్యోగులను నియమించుకుని, మిగతా వారిని లేబర్ కార్మికులను తీసుకుని పనులు చేయిస్తున్నారు. సిగాచి పరిశ్రమలోని రియాక్టర్ వద్ద అనుభవం లేని ఆపరేటర్, కార్మికులు విధులు నిర్వర్తించడంతోనే చల్లదనం, ఉష్ణ్ణోగ్రతలు పరిశీలించడంలో విఫలమై ప్రమాదం జరిగిందనే అనుమానాలు వస్తున్నాయి. రసాయన పరిశ్రమను ప్రతి ఆరు నెలలకు ఒకసారి పలు శాఖల అధికారులు తనిఖీలు చేసి ఎన్వోసీ ఇవ్వాల్సి ఉంటుంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఫ్యాక్టరీస్ డైరెక్టర్, అగ్నిమాపక శాఖలు భద్రత అనుమతులు పరిశీలించాల్సి ఉంటుంది.
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, పలు శాఖల అధికారులు తూతూమంత్రపు చర్యలతో ప్రమాదాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పాశమైలారం పారిశ్రామికవాడలో ఫ్యాక్టరీ తనిఖీలు చేసేందుకు వచ్చిన అధికారులు, పరిశ్రమల కార్యాలయాల్లో రికార్డులు పరిశీలించి ఎన్వోసీలు జారీ చేస్తున్నట్లు తెలిసింది. అధికారులు ప్రతి ఆరు నెలలకు ఒకసారి తనిఖీలు సక్రమంగా చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం లేదని సమాచారం. సర్కార్, అధికార యంత్రాంగం నిర్లక్ష్యంతో ప్రమాదాలు చోటుచేసుకుని కార్మికులు కాలి బూడిదవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
పాశమైలారం పారిశ్రామికవాడలో సిగాచి రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలడం అనుభవం లేని కార్మికుల కారణంగా జరిగి ఉంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం సిగాచి పరిశ్రమ వద్ద పలు శాఖల అధికారులు ప్రమాదంపై విచారణ చేపట్టారు. పరిశ్రమలో ప్రమాదం జరిగిన సమయంలో ఎంతమంది పనిలో ఉన్నారు. అనుభవం ఉన్న కార్మికులు ఎంత మంది ఉన్నారు… అనే కోణంలో వివరాలు సేకరించారు. రియాక్టర్ పేలిపోవడం వెనుక ఎవరి నిర్లక్ష్యం ఉందో విచారణ చేస్తున్నారు. రసాయన పరిశ్రమలో ఎక్కువ మంది అనుభవం లేని కార్మికులు ఉన్నట్లు సమాచారం.
బీహారు, ఒడిశా, మహారాష్ట్రకు చెందిన కార్మికులకు ఎలాంటి అనుభవం ఉండదు. కానీ, సిగాచి రసాయన పరిశ్రమలో ఎక్కువ మంది ఇతర రాష్ర్టాల కార్మికులను పనిలో పెట్టుకున్నారు.బాయిలర్ వద్ద పని చేసేవారికి ప్రెషర్ వాల్స్‌పై అనుభవం ఉండాలి. ప్రెషర్ పెంచితే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు. సిగాచి పరిశ్రమలో అన్‌స్కిల్డ్ కార్మికులను లేబర్ కాంట్రాక్టర్లు నెలకు రూ. 15 వేలలోపు జీతం ఇచ్చి పనిలో పెట్టినట్లు తెలిసింది.
ఈ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు కల్పించాలి. కానీ, కాంట్రాక్టర్లు కార్మికులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదని తెలిసింది. తక్కువ జీతానికి పని చేసే కార్మికులను తెచ్చి, పరిశ్రమలో కొందరి అండదండలతో కాంట్రాక్టర్ పనులు చేయిస్తున్నారు. సిగాచి రసాయన పరిశ్రమలో ప్రమాదం జరిగి మూడు రోజులు గడిచినా ఎంత మంది కాంట్రాక్టర్లు ఉన్నారో అధికారులు ప్రకటించడం లేదు. కాంట్రాక్ట్ కార్మికులు ఎంత మంది, పర్మినెంట్ ఉద్యోగులు ఎంత మంది ఉన్నారో యాజమాన్యం ప్రకటించడం లేదు. పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని పలువురు ఆరోపిస్తున్నారు.