చేర్యాల, జూన్ 13 : గ్రామాల్లో బెల్ట్‌షాపులు బార్లను తలపిస్తున్నాయి. మేం అధికారంలోకి వస్తే బెల్ట్‌షాపులు లేకుండా చేస్తాం.. నాణ్యమైన మద్యం విక్రయాలు జరిపిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చింది. తీరా అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ సర్కారు ఒట్టు తీసి గట్టున పెట్టింది. మద్యం విక్రయాలు మరింత పెంచేందుకు కొత్తగా డిస్టలరీలకు అనుమతి ఇస్తూ తన అసలైన స్వరూపాన్ని బయటపెట్టింది. జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్లు, దుబ్బాక, చేర్యాల మున్సిపాలిటీలతోపాటు అన్ని గ్రామాల్లో బెల్ట్‌షాపులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి.
ఆరు నెలలుగా రాష్ట్రంలో ఎన్నికలు ఉండడంతో మద్యం విక్రయాలు పెరగడంతోపాటు గ్రామాల్లో బెల్ట్‌షాపులు సంఖ్య భారీగా పెరిగింది. ఒక్కో గ్రామాల్లో 5 నుంచి 10 బెల్ట్‌షాపులు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న బెల్ట్‌షాపుల నుంచి నెలవారీగా వాటిని నియంత్రించాల్సిన సంబంధిత శాఖ అధికారులు మామూళ్ల మత్తుతో తూగుతూ పట్టించుకోవడం లేదని గ్రామాల్లో విమర్శలు వినిపిస్తున్నాయి.పైగా గ్రామాల్లోని బెల్ట్‌షాపులన్నీ వైన్‌షాపుల నిర్వాహకులు, ఎక్సైజ్‌శాఖ అధికారుల కనుసన్నల్లోనే కొనసాగుతున్నాయని అన్ని గ్రామాల్లో మహిళలు ఆరోపిస్తున్నారు. బెల్ట్‌షాపులను తొలిగించాలని ఎక్సైజ్ కార్యాలయాన్ని ఆశ్రయిస్తున్నారు.
పట్టణాలు, మండల కేంద్రాల్లో ప్రభుత్వ అనుమతితో కొనసాగుతున్న మద్యం షాపులు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు కొనసాగుతున్నాయి. గాంధీ జయంతి, జెండా పండుగ, ఎన్నికలు, ఎన్నికల ఫలితాల రోజున మూసి ఉంటాయి. కానీ బెల్ట్‌షాపులు మాత్రం ఏ రోజూ అనే తేడా లేకుండా 24 గంటలూ కొనసాగుతున్నాయి. గ్రామాల్లో వేకువజామునే నిద్రలేచే అలవాటు ఉన్న వ్యక్తులు నేరుగా బెల్ట్షాపుకెళ్లి 90ఎంఎల్ వేసుకుని తన రోజువారీ పనులు ప్రారంభిస్తారు. వ్యవసాయ బావుల వద్దకు, పనులకు వెళ్లే సమయంలో నైంటీ, వచ్చేటప్పుడు మరో నైంటీ, రాత్రి పూట ఓ క్వాటర్ అర్ధరాత్రి వరకు తాగుతున్నారు. బెల్ట్‌షాపులు నిర్వాహకులు ఎలాంటి సమయపాలన లేకుండా మందుబాబులకు మద్యం విక్రయిస్తూ లాభాలు గడిస్తున్నారు.
అసలు బెల్ట్‌షాపులకు ఎలాంటి అనుమతి లేదు..ఇల్లీగల్‌గా కొనసాగుతున్న దందాపై మండల కేంద్రం, పట్టణాల్లో ఉన్న వైన్స్ వ్యాపారులు నిబంధనలు విధిస్తున్నారు. జిల్లాలోని ఒక మండల పరిధిలోకి వచ్చే గ్రామాల్లో కొనసాగుతున్న బెల్ట్‌షాపులు అదే మండలంలో ఉన్న వైన్ షాపుల్లో మద్యం కొనుగోలు చేసి గ్రామాల్లో విక్రయించుకోవాలి. దీనికి భిన్నంగా ఎవరైనా బెల్ట్‌షాపు నిర్వాహకుడు మరో మండలంలో మద్యం కొనుగోలు చేసి విక్రయిస్తే ఇక్కడి వైన్స్‌షాపుల నిర్వాహకులు వారిని ఎక్సైజ్ పోలీసులకు పట్టించి కేసులు నమోదు చేయిస్తున్నారు. రోజువారీగా బెల్ట్‌షాపులు కొనసాగుతున్న తీరు, వారు ఎక్కడి మందు తీసుకొచ్చి విక్రయాలు జరుపుతున్నారో తెలుసుకునేందుకు వైన్‌షాపుల వారీగా రైడింగ్ టీం ఏర్పాటు చేసి వ్యాపారం కొనసాగిస్తున్నారు. గ్రామాల్లోని బెల్ట్‌షాపులన్నీ వైన్‌షాపుల నిర్వాహకులు, ఎక్సైజ్‌శాఖ అధికారుల కనుసన్నల్లోనే కొనసాగుతాయి.
బెల్ట్‌షాపులు తొలిగించాలని కోరుతూ చేర్యాల మండలంలోని చిట్యాల గ్రామానికి చెందిన మహిళలు ఇటీవల పట్టణంలోని ఎక్సైజ్ కార్యాలయాన్ని ఆశ్రయించారంటే సిద్దిపేట జిల్లాలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. గ్రామాల్లో అడ్డగోలుగా షాపులు ఏర్పాటు చేసి యథేచ్ఛగా మద్యం విక్రయిస్తున్నారని, ఎప్పుడుపడితే అప్పుడు తాగొచ్చి ఇంట్లో గొడవలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల గ్రామాల్లో ఓ వ్యక్తి తాగొచ్చి గొడవపడి భార్యపై పెట్రోల్ పోశాడు. మరోవ్యక్తి మందు ఎక్కువై చచ్చిపోతానంటూ పురుగుల మందు తాగాడని తెలిపారు.
పట్టణాలు, మండలకేంద్రాల్లో ఉన్న మద్యం షాపుల్లో ప్రభుత్వ నిర్ణయించిన ధరలకు విక్రయాలు జరుగుతుండగా, బెల్ట్‌షాపుల నిర్వాహకులు మాత్రం గ్రామాల్లో అధిక ధరలకు విక్రయించి మందుబాబుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. పండుగ నుంచి చావు వరకు గ్రామాల్లో ఏ కార్యక్రమం జరిగినా మద్యం సేవిస్తుండడంతో వారిని అసరగా చేసుకుని బెల్ట్‌షాపుల నిర్వాహకులు క్వార్టర్‌కు రూ.20, ఆఫ్ బాటిల్‌కు రూ.40, ఫుల్ బాటిల్‌కు రూ.80 వరకు అధికంగా వసూలు చేస్తున్నారు. బార్లలో పోసినట్లు బెల్ట్‌షాపుల్లో సైతం లూజ్ మద్యం విక్రయిస్తున్నారు.