కోహీర్, జనవరి 2: యువతకు శిక్షణ అందించి వారికి ఉపాధి కల్పించేందుకు బీఆర్ఎస్ హయాంలో సీఎం కేసీఆర్ మహాత్మా జ్యోతిబాపూలే హోటల్ మేనేజ్మెంట్ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలను కవేలికి మం జూరు చేశారు. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని కవేలి 65వ జాతీ య రహదారి పక్కన ఉన్న హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలో తాత్కాలింగా తరగతులు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శికి ప్రతిపాదనలు పంపించారు. కానీ, పర్యాటక శాఖ నుంచి ఇంతవరకు ఎలాంటి అనుమతులు రాలేదు. దీంతో కవేలి హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలో తరగతులు ప్రారంభానికి నోచుకోవడం లేదు. మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల కళాశాలలో హోటల్ మేనేజ్మెంట్లో ఇంటర్ పూర్తి చేసిన బీసీ విద్యార్థినులకు బీఎస్సీ డిగ్రీ కోర్సులో మూడేండ్లపాటు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినా, అధికారుల నిర్లక్ష్యంతో ఆచరణ సాధ్యం కాలేదు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారం భం నాటికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.
వృథాగా కళాశాల భవనం…
సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని కవేలి జాతీయ రహదారి పక్కన ఉన్న హోటల్ మేనేజ్మెంట్ కళాశాల వృథాగా మారింది. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రూ.12కోట్ల వ్యయంతో 5ఎకరాల్లో అద్భుతమైన భవనాన్ని నిర్మించారు. హోటల్ మేనేజ్మెంట్ కళాశాలను 2017, ఆగస్టు 3న అప్పటిమంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. 2017-18లో బీఎస్సీలో 15మంది శిక్షణ పొందేందుకు కళాశాలలో చేరారు. 2018-19లో 14మంది. 2019-20లో ఏడుగురు విద్యార్థులు జాయిన్ అయ్యారు. మూడేండ్ల బీఎస్సీ కోర్సుతో పాటు 18నెలల క్రాఫ్ట్ కోర్సును అందించారు. ఇందులో కూడా 25మంది పలు రాష్ర్టాలకు చెందిన యువత శిక్షణ పొందారు.
కానీ, కరోనా ప్రభావంతో రెండేండ్ల నుంచి విద్యార్థులు ఎవరూ జాయిన్ కాలేదు. ప్రస్తుతం భవనం ఖాళీగా ఉంది. కళాశాలలో ఇద్దరు సిబ్బంది ఉన్నారు. వారికి కూడా మే నుంచి జీతాలు రాకపోవడంతో అవస్థలు పడుతున్నారు. తరగతి గదులు, భవనాన్ని శుభ్రం చేసేందుకు ముగ్గురు కార్మికులు ఉండేవారు. వారు కూడా మానుకున్నారు. కళాశాలలో రెండేండ్లుగా ఎవరూ జాయిన్ కావడం లేదనే విషయం తెలుసుకొన్న గత ప్రభుత్వం బీసీ విద్యార్థినుల శిక్షణ కోసం మహిళా డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మహాత్మా జ్యోతిబాపూలే మహిళా డిగ్రీ కళాశాలను ప్రారంభించి తాత్కాలికంగా తరగతులు నిర్వహించేందుకు అనుమతులు కావాలని రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శికి ప్రతిపాదనలు పంపించారు. పర్యాటక శాఖ నుంచి ఇంత వరకు అనుమతులు రాలేదు. అనుమతి లభిస్తే మాత్రం 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి తరగతులు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని విద్యార్థినులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు.
ప్రారంభిస్తే బాగుంటుంది
మహిళా డిగ్రీ కళాశాలను ప్రారంభించి హోటల్ మేనేజ్మెంట్లో శిక్షణ ఇస్తేనే బాగుంటుంది. లేకపోతే భవనం కూడా వృథాగా అవుతుంది. ఇంత పెద్ద భవనం ఖాళీగా ఉంటే ఏం లాభం. ఎవరికైనా ఉపయోగపడాలి కదా. మాకు కూడా మే నుంచి జీతాలు రావడం లేదు.
– చంద్రయ్య, కవేలి హోటల్‌మేనేజ్‌మెంట్ కళాశాల, సిబ్బంది
భవనం వృథా కావొద్దు
హోటల్ మేనేజ్మెం ట్ కళాశాల్లో విద్యార్థులు అన్ని రకాలు గా శిక్షణ పొందడానికి భవనం సిద్ధంగా ఉంది. 60మందికి సరిపడే విధంగా హాస్టల్ భవనం ఉంది. తాగునీరు, కరెం టు ఎల్లప్పడూ అందుబాటులో ఉంటా యి. ఇంత పెద్ద భవనం వృథా కాకుండా చూడాలి. విద్యార్థులకు కూడా భవిషత్యు బాగుంటుంది. మాకు కూడా జీతాలు చెల్లించి, మా సమస్యలు పరిష్కరించాలి.
– అమర్నాథ్, హోటల్ మేనేజ్మెంట్ కళాశాల సిబ్బంది