సిద్దిపేట, జూన్ 14(నమస్తే తెలంగాణ ప్రతినిధి): సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా శుక్రవారం బాధ్యతలు చేపట్టిన ప్రావీణ్య, సిద్దిపేట కలెక్టర్‌గా శనివారం బాధ్యతలు తీసుకున్న హైమావతికి సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. మూడు రోజుల క్రితం ఐఏఎస్‌ల బదిలీలు జరగగా, వీరిద్దరు సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు కలెక్టర్లుగా నియమితులయ్యారు. బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి పెద్ద ఎత్తున జరిగింది. సంక్షేమం ఫలాలు అర్హులకు అందాయి. నిత్యం ఏదో కార్యక్రమంతో ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండేవారు. దీంతో బీఆర్ఎస్ హయాంలో పాలనలో హడావిడి కనిపించేది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నర పాలనలో ఉమ్మడి మెదక్ జిల్లాకు తీవ్రంగా అన్యాయం జరుగుతున్నది. ఆశించిన మేర నిధులు రావడం లేదు. పథకాలు సంపూర్ణంగా అందడం లేదు. అంతేకాకుండా యంత్రాంగంలో ఒక విధమైన నిర్లిప్తత నెలకొంది. పాలన ఉండా లేన్నట్లు పరిస్థితి ఉంది. సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అధికారుల పర్యవేక్షణ అశించిన మేర లేదని విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ పథకాల్లో భారీగా అవినీతి పెరిగి పోయింది. ధాన్యం కొనుగోలులో భారీగా అక్రమాలు, జిల్లాలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి.
ఆయా శాఖల ఉన్నతాధికారులపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. క్షేత్ర స్థాయి ఉద్యోగులపై ఉన్నతాధికారుల వేధింపులు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. జిల్లాలోని కీలక శాఖల్లో అవినీతి పెరిగి పోయింది. ఇటీవల జిల్లా వైద్యారోగ్య శాఖలో నిధుల గోల్మాల్ అయ్యాయి. మున్సిపల్ శాఖలో అంతు లేని అవినీతి చోటు చేసుకుంటుంది. విద్యుత్ అధికారుల అవనీతికి అంతు లేకుండా పోయింది.ఏ చిన్న పని కావాలన్న పైసలు ఇస్తేనే అవుతున్నాయి. విద్యుత్ లైన్ వేయకుండానే వేసినట్లు రికార్డులు సృషించి ఇష్ట్టానుసారంగా కేబుల్, విద్యుత్ స్తంభాలను ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఇక చెప్పాల్సిన అవసరం లేదు. లంచాలు ఇస్తే ఏదైనా పనిచేసి పెడుతున్నారు.
జిల్లా పంచాయతీ అధికారులు క్షేత్రస్థాయిలోని అధికారులను మామూళ్ల కోసం ఒత్తిడి చేస్తున్నారు. టూర్ల పేరిట ఆ గ్రామాలకు వెళ్తే కిందిస్థాయి ఉద్యోగులు ఎంతో కొంత తడపాల్సిందే. అలా ఇవ్వకపోతే ఇబ్బందులు గురిచేస్తున్నారు. సివిల్ సైప్టె అధికారుల ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ప్రధాన శాఖల్లో సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం కొత్త కలెక్టర్లపై ఎంతైనా ఉంది. పాలనను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది. ఆయా శాఖల్లో జరుగుతున్న అవినీతిని కట్టడి చేసి..ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా చూడాల్సిన బాధ్యత కొత్త కలెక్టర్లపై ఉంది.
సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో పలు శాఖల్లో అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని శాఖల్లో అవినీతి బాగా పెరిగిపోయింది. ఉన్నతాధికారులే అవినీతికి పాల్పడడంతో కింది స్థాయి అధికారులు అదే దారిలో పోతున్నారు. ఆయా శాఖలపై అధికారుల నియంత్రణ కరువైంది.క్షేత్ర స్థాయిలో సమన్వయం చేయడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో రెవెన్యూ శాఖ పూర్తిగా అవినీతి కంపులో కూరుకుపోయింది. తహసీల్దార్లు తమ కార్యాలయాల్లోనే పైరవీకారులతో పనులు చక్కబెడుతున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో వందల ఎకరాల్లో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. వాటిపై చర్యలు నామమాత్రంగానే ఉన్నాయి.సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రభుత్వం భూములు కబ్జాకు గురై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.
పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతం కావడంతో, రాష్ట్ర రాజధానికి దగ్గరగా ఉండడంలో ఇక్కడి భూములకు ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఇక్కడ ప్రభుత్వ భూములు వందల ఎకరాలు ఇప్పటికే అన్యాక్రాంతం అయ్యాయి. తహసీల్దార్లు బడానాయకుల కనుసన్నల్లో పనిచేస్తూ ప్రభుత్వ భూములు అప్పనంగా వారికి కట్టబెడుతున్నారు.రెవెన్యూ అధికారులపై ఫిర్యాదులు వచ్చినా చర్యలు శూన్యం. కనీసం విచారణ చేయడం లేదు. పోలీస్‌శాఖ క్రమ శిక్షణకు మారుపేరు. ఆ శాఖ గాడితప్పింది. ప్రతి పోలీస్‌స్టేషన్ ఒక సెటిల్మెంట్కు అడ్డాగా మారింది. నిత్యం సివిల్, ఇతర వ్యవహారాల్లో తల దూరుస్తూ వారి విధులు పూర్తిగా మర్చిపోయారు.ఇటీవల ఏసీబీ రైడ్‌లో సైతం పలువురు ఉద్యోగులు పట్టుబడిన విషయం తెలిసిందే.
గంజాయి, ఇసుక దందాలు జోరుగా కొనసాగుతున్నాయి. వైద్యశాఖలో నిధుల గోల్మాల్ అయ్యాయి. నకిలీ మందులు అమ్ముతున్నా చర్యలు శూన్యం. పుట్టగొడుగులా మందుల దుకాణాలు పుట్టుకొస్తున్నాయి. వాటిపై నియంత్రణ కరువవడంతో డ్రంగ్స్ దందా జోరుగా కొనసాగుతున్నది. సిద్దిపేట జిల్లా పత్తి కొనుగోళ్లలో అధికారులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడంలో భారీగా కుంభకోణం జరిగింది. ఈ విషయాన్ని ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తేవడంతో పలువురు అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది.జిల్లాలో నకిలీ విత్తనాల దందా జోరుగా కొనసాగుతున్నది. కనీసం దానిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. నామమాత్రంగా దాడులు చేస్తున్నారు తప్పా మరోటి లేదు.
ప్రభుత్వ పథకాలు పేద ప్రజలకు అందడం లేదు. దీంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం అందించే పథకాలకు మామూళ్లు తడపనిదే పనికావడం లేదు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావాలంటే డబ్బులు ఇస్తేనే ఇల్లు మంజూరవుతున్నాయి. ప్రత్యేకాధికారుల పాలనలో సమస్యలు పరిష్కారానికి నోచుకోక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యం, చెత్త సేకరణ, నర్సరీలు, మొక్కల పెంపకం, వీధి లైట్లు, డంపుయార్డులు, వైకుంఠధామాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. నిధుల లేమితో పంచాయతీ కార్యదర్శులు పనులు చేయలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితులు జిల్లాలో ఉన్నాయి. కొత్త కలెక్టర్లు తమ సామర్థ్యంతో సమస్యలు పరిష్కరించడంతో పాటు మెరుగైన పాలన అందించాలని ప్రజలు ఆశపడుతున్నారు.