Harish Rao | మెదక్ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రజలు ప్రశ్నిస్తున్నారని డైవర్షన్ టాక్టిక్స్ చేస్తున్నాడు. నిన్న నాకు నోటీసులు ఇచ్చిండు.. నేడు కేటీఆర్‌కు ఇచ్చిండన్నారు.
కేటీఆర్ ఒకవైపు నుంచి నిలదీస్తుండు.. ఇంకోవైపు నుంచి నేను అడుగుతనే ఉన్నా. సమాధానాల్లేవ్.. నీ బొగ్గు కుంభకోణంలో నీ బావమరిదికే నువ్వు సాయం చేసినవ్ నీ సంగతి ఏందంటే.. దాని మీద సమాధానం లేదు. సిట్ నోటీసులు పంపుతుండు. భయపడుతమనుకుంటున్నవా..? నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా బిడ్డా నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటామని హరీశ్ రావు స్పష్టం చేశారు.
మహాలక్ష్మి ఇచ్చే దాకా అడుగుతాం. రైతు రుణమాఫీ అడుగుతాం. నువ్వు అవ్వా తాతలకు రూ.4వేలు ఇచ్చేదాకా అడుగుతం. నువ్వు తులం బంగారం ఇచ్చే దాకా అడుగుతనే ఉంటం. ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ఇచ్చేదాకా రేవంత్ రెడ్డి వెంట పడుతూనే ఉంటం. నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా.. ఎన్ని అటెన్షన్ డైవర్షన్లు చేసినా నీ వెంటనే పడ్తమని హరీశ్ రావు హెచ్చరించారు.
మనం మున్సిపల్ ఎన్నికల్లో పనిచేసుకోవద్దు. ఈ సిట్ నోటీసులు ఇచ్చి దాని చుట్టూ తిరగాలే. నీ బావమరిది బొగ్గు కుంభకోణం భయటకు రావొద్దు. ఈ సిట్ నోటీసులమీద డైవర్షన్ పాలిటిక్స్ చేయాలే. ఈ డ్రామాలు నడవవు.. జనాలకు అన్నీ అర్థమైపోయినయి. నువ్వు ప్రజలను మోసం చేసినవని హరీశ్ రావు మండిపడ్డారు.
మెదక్ అభివృద్ధి కోసం చేసిన ఒక్క పనిని చూపించగలరా..?
ఇందిరా గాంధీ హయాం నుంచి 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లా గురించి ఊరించింది తప్ప జిల్లాను చేయలేదు. కానీ కేసీఆర్ మాట ఇచ్చి, మెదక్‌ను జిల్లాగా చేసి చూపించారని హరీశ్ రావు అన్నారు. . ఒకప్పుడు వారానికి ఒకసారి మంచినీళ్లు వచ్చే మెదక్ లో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన మంజీరా జలాలు అందించాం. కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్, 100 పడకల ఆసుపత్రి, మెడికల్ కాలేజీ, మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు, మైనార్టీ స్కూల్స్, రైతు బజార్, గ్రంథాలయం, షాదీఖానా.. ఇవన్నీ బీఆర్ఎస్ హయాంలోనే వచ్చాన్నారు.
మెదక్‌కు రైలు తెచ్చింది. పట్టణంలో నాలుగు లైన్ల రోడ్లు వేసింది, ఘనపురం కాలువలను ఆధునీకరించింది, హల్దీ వాగుపై చెక్ డ్యాములు కట్టింది కేసీఆర్ ప్రభుత్వమేనని హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లయింది. మెదక్ అభివృద్ధి కోసం చేసిన ఒక్క పనిని చూపించగలరా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలన మెదక్ ను అధ్వాన్నంగా మార్చింది. మైనార్టీలకు 4000 కోట్లు బడ్జెట్ పెడతామని మోసం చేశారు. ఇమామ్, మౌజంలకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఘనపురం ప్రాజెక్టు కింద క్రాప్ హాలిడే ప్రకటించే దుస్థితి తీసుకొచ్చారు.
కేసీఆర్ రైతుబంధు నిధులు నాట్లకు ఇస్తే.. రేవంత్ రెడ్డి కేవలం ఓట్ల కోసమే ఇస్తున్నారు. ట్రాఫిక్ చలాన్ల పేరుతో ప్రజలకు తెలియకుండానే బ్యాంక్ అకౌంట్ల నుండి డబ్బులు కట్ చేస్తామని రేవంత్ రెడ్డి అంటున్నారు. నువ్వు ముఖ్యమంత్రివా లేక సైబర్ నేరగానివా? అని హరీశ్ రావు మండిపడ్డారు.