సంగారెడ్డి, మార్చి 29(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలో ప్రజలకు నీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. ఓవైపు భూగర్భ జలమట్టాలు తగ్గుముఖం పట్టడం, మరోవైపు మిషన్ భగీరథ నిర్వహణ లోపాల కారణంగా తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మిషన్ భగీరథ నిధులకు ప్రభుత్వ కోతలు విధించడం, కరెంటు కోతలు, క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి వేతనాలు ఇవ్వకపోవడంతో తాగునీటి సరఫరాలో సమస్యలు ఎదురవుతున్నాయి. మిషన్ భగీరథ పథకంలో పనిచేసే కార్మికులకు మూడు నెలలుగా వేతనాలు అందలేదు. దీంతో వారు మరోసారి ధర్నా చేసేందుకు సిద్ధమవుతున్నారు.
గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో తాగునీటి సరఫరాపైనా ప్రభావం పడుతున్నది. పైప్‌లైన్ లీకేజీ సమస్యలు తలెత్తితే వెంటనే మరమ్మతులు చేయించక పోవడంతో నీటికోసం గ్రామీణ ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. సంగారెడ్డి జిల్లాలో నారాయణఖేడ్, అందోలు, జహీరాబాద్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో తాగునీటి సమస్యల తలెత్తుతున్నాయి. ముఖ్యంగా మిషన్ భగీరథ పంప్‌హౌస్, సంప్‌హౌస్‌ల వద్ద మోటర్లు కాలిపోవటం, పైప్లైన్లు లీకేజీలు కావడం తదితర సమస్యలతో తాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ మానస పుత్రిక ‘మిషన్ భగీరథ’ ద్వారా సంగారెడ్డి జిల్లాలో ఇంటింటికీ నల్లాల ద్వారా సరక్షిత నీటిని సరఫరా చేశారు. మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా అందుబాటులోకి వచ్చిన తర్వాత కలుషిత జలాల పంపిణీకి చెక్ పడింది. దీంతో కలుషిత జలాలతో సంక్రమించే జబ్బులు తగ్గుముఖం పట్టాయి. సంగారెడ్డి జిల్లాలో రూ.1689 కోట్లతో మిషన్ భగీరథ పథకంలో గ్రామాల్లో 3006 కిలోమీటర్లు, పట్టణాల్లో 559 కిలోమీటర్ల పైప్లైన్లు వేశారు.
11 సంప్హౌస్లు, 1467 ఓవర్‌హెడ్ ట్యాంకులు నిర్మించారు. గ్రామీణ ప్రాంతాల్లో 2,88,719, పట్టణాల్లో 37వేల నల్లా కనెక్షన్ల ద్వారా కేసీఆర్ హయాంలో తాగునీటి సరఫరా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మిషన్ భగీరథ నిర్వహణ పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం సరైన నిధులు ఇవ్వకపోవడం, నిర్వహణ లోపాల కారణంగా గ్రామాల్లో తాగునీటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. జిల్లాలోని ఇంకా 1467 నివాసాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరా చేయాల్సి ఉండగా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఒకరోజు విడిచి ఒకరోజు తాగునీరు సరఫరా చేస్తుండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ నియోజకవర్గంలో మిషన్ భగీరథ పథకం నిర్వహణ సరిగ్గా లేదు. మోటర్లు కాలిపోయినా, పైప్లైన్లు లీకేజీ అయినా సిబ్బంది వెంటనే మరమ్మతు చేయకపోవడంలో నీటి సరఫరా నిలిచిపోతున్నది. నాగల్గిద్ద మండలం రత్నానాయక్ తండా, కొండ్యానాయక్ తండాతో పాటు ఇతర తండాల్లో నీటి సమస్య ప్రారంభమైంది. కంగ్టి మండలంలోని బోర్గి, దెగుల్‌వాడి, చౌకట్పల్లి, నాగూర్(బి)గ్రామాల్లో నీటి సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రెండు మూడు రోజులకు ఒకసారి నీరు సరఫరా అవుతున్నది. మిషన్ భగీరథ నిర్వహణ లోపం కారణంగా ఇటీవల మనూరు మండలంలోని ఎల్గోయి, అంతిమ్యాల్, ఎన్జీ హుక్రానా, తోర్నాల్ గ్రామాల్లో నీటి సరఫరా నిలిచిపోయింది. ఝరాసంగం మండలం వనంపల్లి, గోప్యానాయక్ తండాల్లో నీటి సమస్య నెలకొంది. వనంపల్లిలో మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా సరిగ్గా జరగడం లేదు. గ్రామంలో రెండు సింగిల్‌ఫేజ్ మోటర్లు ఆగిఆగి నీళ్లు పోయడంతో ట్యాంకులు నిండడం లేదు.
ఝరాసంగం మండలంలోని చీలపల్లి, ఎల్గోయి, కుప్పానగర్, పొట్టిపల్లి గ్రామాలకు మిషన్ భగీరథ నీరు సరఫరా కావడం లేదు. సంగారెడ్డి మండలం చెర్యాల్తో పాటు పలు గ్రామాల్లో తాగునీటి సమస్య ప్రారంభమైంది. అందోలు మండలం కంసాన్పల్లి, వట్పల్లి మండలం బిజిలీపూర్ గ్రామంలో నీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సంగారెడ్డి, అందోలు, జహీరాబాద్, నారాయణఖేడ్ మున్సిపాలిటీల్లో సైతం మిషన్ భగీరథ ద్వారా ఇంటింటి నీటి సరఫరాలో తరుచూ సమస్యలు తలెత్తుతుండడంతో ప్రజలకు నీటి కష్టాలు తప్పడం లేదు. సంగారెడ్డి, పటాన్చెరు ప్రాంతాల్లో నీటిఎద్దడి ఎక్కువగా ఉంది. మిషన్ భగీరథ నీరు సరిపోక ప్రజలు ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు.