జహీరాబాద్, డిసెంబర్ 7 : సర్పంచ్ ఎన్నికల్లో ప్రతి ఓటు ఎంతో కీలకమైందే. ఒక్క ఓటు తేడాతో సర్పంచులు, వార్డు సభ్యుల గెలుపోటములు తలకిందులైన సంఘటనలు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో పంచాయతీ ఓటర్ల జాబితా తప్పుల తడకగా మారింది. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా క్షేత్రస్థాయిలో సిబ్బంది ఓటర్ల జాబితా సవరణలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు.
గతంతో ఉన్న ఓటరు జాబితాలోకి కొత్తగా నమోదైన ఓటర్లను జతచేసి, అస్తవ్యస్తంగా జాబితాను తయారుచేశారు. రెండు, మూడేండ్ల క్రితం మృతిచెందిన వ్యక్తుల పేర్లు, పెండ్లి చేసుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి పేర్లు జాబితాలో ఉండడం చూస్తుంటే అధికారుల పని తీరు ఎలా ఉందో తెలుస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులకు పలుసార్లు అవకాశం కల్పించినా, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. జహీరాబాద్ నియోజకవర్గంలో మొత్తం 1,90,093 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 95,326 మంది మహిళలు, 94,767 మంది పురుషులు ఉన్నారు.
గతేడాది ఫిబ్రవరిలో పంచాయతీల పాలకవర్గం పదవి కాలం ముగిసింది. వీటికి ఎన్నికలు నిర్వహించేందుకు 2024 సెప్టెంబర్ నుంచే ఎన్నికల సంఘం కసరత్తు చేసింది. అప్పట్లోనే అసెంబ్లీ ఎన్నికల నాటి ఓటరు జాబితా అధారంగా ముసాయిదా జాబితా రూపొందించి. అక్టోబర్ 1న తుది జాబితాను ప్రకటించారు. ఆ తర్వాత పలు కారణాలతో ఎన్నికలు వాయిదా పడగా, 2025 జూన్ నుంచి కసరత్తు చేస్తూ సెప్టెంబర్లో పంచాయతీ ఓటర్ల తుది బాబితాను మరోసారి ప్రకటించింది. మార్పులు, చేర్పులు అవకాశం ఇచ్చినా బీఎల్వోలు ఎక్కడ ఇంటింటికీ తిరిగిన పాపాన పోలేదు.
2019లో జరిగిన పంచాయతీ ఎన్నికల సమయంలో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల ఓట్లు ఒక్కొక్కరివి ఒక్కో వార్డులో నమోదై ఉన్నాయి. దీంతో ఓటర్లు ఓటు వేసేందుకు వెళ్లిన సమయంలో చాలా ఇబ్బందులు పడ్డారు. గతంలో మాదిరిగా ఇబ్బం దులు తలెత్తకుండా ఇంటింటికీ బీఎల్వోలు తిరిగి కుటుంబంలోని ఓట్లన్నీ ఒకేవార్డులో ఉండేలా చూడాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. కానీ, జహీరాబాద్ నియోజకవర్గంలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో తూతూమంత్రంగానే బీఎల్వోలు ఈ ప్రక్రియను చేపట్టారు. కుటుంబంలో మూడు ఓట్లు ఉంటే.. రెండు ఓట్లు ఓ వార్డులో, ఇంకో ఓటు మరో వార్డులో ఉన్నాయి.
చనిపోయి రెండు, మూడేండ్లు అయినా, పెండ్లి చేసుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లిన ఆడపిల్లల పేర్లు జాబితాలో అలాగే ఉన్నాయి. ఒకవార్డులో ఉన్న వారి పేర్లు మరో వార్డులో పేర్లు ఒకేవిధంగా ఉన్నాయి. ఎన్నికల అధికారులు స్పష్టమైన ఆదేశాలిచ్చినా, ప్రస్తుతం నియోజకవర్గంలోని ఆయా మండలాల్లోని గ్రామాల్లో తప్పులతో ఓటర్ల జాబితా ఉండడంతో పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో నియో జకవర్గంలోని ఆయా మండ లాల్లో జరిగే పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ప్రచారానికి ఇబ్బందులు తప్పడం లేదు. ఒక వార్డులో ఉన్న వారి పేర్లు మరో వార్డులో ఉండడంతో వార్డులో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎవరికీ ఎక్కడ ఓటు వేయాలో తెలియక ఓటర్లు తికమక పడుతున్నారు. ఈనెల 14,17 తేదీల్లో జరిగే ఎన్నికల్లో ఓటు వేసే సమయంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుం టాయోనని ఓటర్లు ఆందో ళన చెందుతున్నారు.