సిద్దిపేట, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు భారీగానే ఓటర్లు నమోదయ్యారు. పట్టభద్రులు ఎమ్మెల్సీ స్థానానికి 3,58,452 మంది, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 27,879 మంది ఓటరుగా నమోదు చేసుకున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో సిద్దిపేట నుంచి పట్టభద్రులు 32,133 మంది, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 3,612 మంది నమోదు చేసుకున్నారు. మెదక్ జిల్లాలో 13,885 మంది పట్టభద్రులు,1,443 మంది ఉపాధ్యాయులు, సంగారెడ్డి జిల్లాలో 28,275 మంది పట్టభద్రులు, 3,119 మంది ఉపాధ్యాయులు తమ ఓటును ఈనెల 6 వరకు నమోదు చేసుకున్నారు.
నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో ప్రస్తుతం 15 జిల్లాలు ఉన్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఆన్లైన్ విధానంలో ఓటరుగా నమో దు చేసుకున్నారు.డిగ్రీ ఉత్తీర్ణులైన వారు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి,స్కూల్ అసిస్టెంట్లు, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లు, యూడైస్‌లో నమోదైన ప్రైవేట్ పాఠశాలల్లోని టీచర్లు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఓటరుగా నమెదు చేసుకున్నారు. పట్టభద్రుల స్థానం నుంచి ఎమ్మెల్సీగా జీవన్‌రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా రఘోత్తమ్ రెడ్డి కొనసాగుతున్నారు. వచ్చే ఏడాది మార్చి 29న వీరి పదవీ కాలం ముగియనున్నది.
డిసెంబర్ 30న తుది ఓటరు జాబితాను విడుదల చేయనున్నారు. 2019 ఎన్నికల ప్రకారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి 23,214 మంది ఓటర్లు ఉండగా, పట్టభద్రుల ఎమ్మె ల్సీ స్థానానికి 1,96,321 మంది ఓటర్లు ఉన్నారు. పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మె ల్సీ స్థానాలకు ఓటరు నమోదు ఈసారి భారీగా ఆసక్తి చూపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడానికి పట్టభద్రులు తమ ఓటుహక్కును నమోదు చేసుకున్నారు.
ఈనెల 6 వరకు నమోదైన వివరాలు చూస్తే పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 3,58,452 మంది ఓటరుగా నమోదు చేసుకున్నారు. గత ఎన్నికల కంటే ఈసారి 1,62, 131మంది పట్టభద్రుల ఓటర్లు నమోదయ్యాయి. ఈసారి పట్టభద్రులు తమ ఓటు ను నమోదు చేసుకోవడానికి పోటీపడ్డారు. మరింత సమయం ఉంటే ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 27,879 మంది ఓటరుగా నమోదయ్యారు. గత ఎన్నికల్లో 23,214 మంది ఉండగా, ఈసారి 27,879 మంది ధరఖాస్తు చేసుకున్నారు. ఈసారి 4,665 మంది ఎక్కువ నమోదయ్యారు. ఈనెల 30న తుది ఓటరు జాబితా రానున్నది. దీంతో పూర్తి ఓటరు లెక్క తేలనున్నది.
పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పోటీచేస్తున్న అభ్యర్థులు ప్రచారంపై దృష్టిసారించారు. 2019 ఎన్నికల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 17 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. ఈసారి ఆ సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ప్రధాన పార్టీలు నిమగ్నమయ్యాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీతో పాటు ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు రంగంలో ఉండనున్నారు. ఎమ్మెల్సీ స్థానం 15 కొత్త జిల్లాల పరిధికి విస్తరించి ఉంది. దీంతో ఎక్కువ మంది అభ్యర్థులు రంగంలో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ ఎమ్మెల్సీ స్థానాం పరిధిలో 271 మండలాలు, 43 శాసనసభ నియోజకవర్గాలు విస్తరించి ఉన్నా యి. ఇక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పలువురు పోటీ చేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. ఇప్పటికే పీఆర్టీయూ తమ అభ్యర్థిగా వంగ మహేందర్ రెడ్డిని ప్రకటించింది. ఆయన తన ప్రచారాన్ని ప్రారంభించారు. అన్ని జిల్లాలను తిరుగుతూ ఉపాధ్యాయులను కలుస్తూ తనను గెలిపించాలని కోరుతున్నారు.