హుస్నాబాద్‌టౌన్, జూన్ 28: అసెంబ్లీ ఎన్నికల్లో గెలువగానే గౌరవెల్లి రిజర్వాయర్‌ను పూర్తిచేస్తామని చెప్పిన మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ 18 నెలలు గడుస్తున్నా ఎందుకు పూర్తి చేయలేదని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ ప్రశ్నించారు. శనివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌరవెల్లిపై గ్రీన్‌ట్రిబ్యునల్‌కు పోయి కేసులు వేయించారని, అయినప్పటికీ పరిహారం కోర్టులో జమచేశామన్నారు. ఎన్నికల సమయంలో రైతులకు రూ. 30లక్షల పరిహారం ఇప్పిస్తామని చెప్పిన మంత్రి పొన్నం ఇప్పుడు ఆ రైతులకు రూ.17లక్షలు మాత్రమే ఇస్తామని చెప్పడం మాట తప్పడం కాదా అని ప్రశ్నించారు.
రూ. 437 కోట్లు మంజూరుచేశామని చెబుతున్నప్పటికీ ఇప్పటి వరకు కాల్వల నిర్మాణంలో ఎన్ని ఎకరాలు సేకరించారో చెప్పాలని నిలదీశారు. వట్టిమాటలు ఎందుకు మాట్లాడుతున్నారు.. మంత్రిగా ఏంచేశారో ప్రజలకు చెప్పాలని, గౌరవెల్లిలో తట్టెడు మట్టికూడా తీయలేదనే విషయం గుర్తుచేసుకోవాలన్నారు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో నాడు పర్యటించిన రేవంత్‌రెడ్డి గండిపల్లిని చూసి పనులు జరగడంలేదని చెప్పారన్నారు. గౌరవెల్లిలో 2టీఎంసీల నీళ్లు నింపాలని చెప్పినా చేతగాక, ఇతర మంత్రుల చేత కీర్తించుకోవడం తప్పా చేసింది ఏమీలేదని ఆయన విమర్శించారు.
గౌరవెల్లి పూర్తిచేస్తే లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వవచ్చనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. హుస్నాబాద్‌కు మూడు సార్లు జాతీయ అవార్డులు, మున్సిపల్భవనం, ఏసీపీ కార్యాలయం, ఆర్డీవో కార్యాలయం, ఐవోసీతోపాటు చెరువుల పునర్నిర్మాణం, ఇంటింటికీ తాగునీరు ఇలా ఎన్నోఅభివృద్ధి పనులు కేసీఆర్ హయాంలో చేశామని ఆయన గుర్తుచేశారు. కేసీఆర్ హయాంలో నిర్మించిన ఎమ్మెల్యే క్వార్టర్‌లోనే నివాసం ఉంటున్న విషయాన్ని మంత్రి గుర్తుంచుకోవాలన్నారు. హుస్నాబాద్‌కు మెడికల్ కళాశాల తీసుకువస్తామని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకాగాం ధీ ఎన్నికల సమయంలో చెప్పారని, ఇప్పుడేమో హుస్నాబాద్ చుట్టూ మెడికల్ కళాశాలలు ఉన్నాయని మంత్రి పొన్నం చెబుతూ ఎన్నికల హామీని తుంగలో తొక్కుతున్నారన్నారు.
మెడికల్‌కళాశాల లేకుండా పీజీ విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసిస్తారని మంత్రి రాజనర్సింహ చెప్పడం ఆశ్చర్యకరమన్నారు. హుస్నాబాద్‌కు శాతావాహన ఇంజినీరింగ్కళాశాలను తీసుకురావడం అభినందనీయమే కానీ ఆ కాలేజీసైతం మేము నిర్మించిన పాలిటెక్నిక్ కళాశాలలోనే నిర్వహిస్తున్న విషయాన్ని తెలుసుకోవాలన్నారు. హుస్నాబాద్ దవాఖానను 30నుంచి 50పడకలకు పెంచామని, మాతాశిశు ఆరోగ్యకేంద్రాన్ని సైతం 50పడకల దవాఖానగా బీఆర్ఎస్ సర్కారు నిర్మించిందన్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ తప్పుడు మాటలు చెప్పారని, కొత్తపల్లినుంచి జనగామ వరకు నాలుగులైన్ల రహదారిని బీఆర్ఎస్ ప్రభుత్వంలోని కేటీఆర్దృష్టికి తీసుకుపోయి ప్రతిపాదనలు పంపామన్నారు.
మంత్రితో తిరిగే ఒక నాయకుడు అంబులెన్స్ లేదని చందాలు వసూలు చేశారని ఆ డబ్బులు ఏమైనాయో చెప్పాలని డిమాండ్ చేశారు. వట్టి మాటలు కాదు పనిచేసి చూపించాలని, మంత్రిగారు తస్మాత్జాగ్రత్త, మాట లు ఎవరైనా మాట్లాడుతారని, మీరుచేసే అభివృద్ధిగురించి మాట్లాడుకోండి… చెప్పుకోండి. కాని చేతగాని వ్యక్తిలాగా విమర్శలు సరికాదన్నారు. హుస్నాబాద్ పర్యటనలో ముగ్గురు మంత్రులు అభివృద్ధి గురించి మాట్లాడకుండా తప్పుడు మాటలు చెబితే ఈ ప్రాంత ప్రజలు సహించరన్నారు.
విలేకరుల సమావేశంలో హనుమకొండ జడ్పీ మాజీచైర్మన్ సుధీర్‌కుమార్, సిద్దిపేట జడ్పీ మాజీవైస్‌చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, మాజీప్రజాప్రతినిధులు మాలోతు లక్ష్మి, భుక్యామంగ, ఎడబోయిన రజిని, సుద్దాల చంద్రయ్య, ఆకుల వెంకట్, ఎడబోయిన తిరుపతిరెడ్డి, మాలోతు బీలూనాయక్, లింగాల సాయన్న, బీఆర్ఎస్ హుస్నాబాద్ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు గంగం మధుకర్‌రెడ్డి, పెసురు సాంబరాజు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎండీ అన్వర్, నాయకులు లక్ష్మణ్‌నాయక్, ఎంపీరెడ్డి, మధుకర్, శంకర్‌రెడ్డి, శ్రీనివాస్, సదానందం, రాజునాయక్, స్వరూ ప, రవీందర్, భాగ్యారెడ్డి, నవీన్‌రావు, శ్రీనివాస్, విజయభాస్కర్ పాల్గొన్నారు.