మద్దూరు (ధూళిమిట్ట), ఏప్రిల్ 22: ధూళిమిట్ట పెద్దవాగు నుంచి ఇసుక తరలింపుపై ధూళిమిట్ట గ్రామస్తులు భగ్గుమన్నారు. వాగు నుంచి ఇసుకను బయటకు పోకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం తహసీల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. వాగులోని ఇసుకను సంరక్షించి, రైతులను ఆదుకోవాలని నినదించారు. గ్రామానికి పెద్దవాగే దిక్కని, వాగులో నుంచి ఇసుక బయటకు తరలించడంతో భూగర్భ జలాలు అడుగంటి బోరుబావులు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామ అవసరాలకే ఇసుకకు అనుమతులివ్వాలని, బయటకు వెళితే ఊరుకునేది లేదన్నారు. ధూళిమిట్ట పెద్దవాగు నుంచి ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని ధూళిమిట్ట తహసీల్దార్ శ్యామ్‌కు జనగామ ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఫోన్లో ఆదేశించారు. వాగులోని చెక్‌డ్యాంలో ఇసుక తీయడంతో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయని మండిపడ్డారు.
ఇసుక తరలింపును నిలిపివేయాలని కోరుతూ సర్పంచ్ గునుకుల లీలా జగన్మోహన్రెడ్డి, మాజీ సర్పంచ్ దుబ్బుడు దీపికావేణుగోపాల్రెడ్డితో కలిసి గ్రామస్తులు తహసీల్దార్‌కు వినతి పత్రాన్ని అందించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ నాచగోని పద్మావెంకట్గౌడ్, మాజీ సర్పంచ్‌లు నాచగోని పద్మాలక్ష్మణ్గౌడ్, సుద్దాల రేణుకానర్సింహులు, మాజీ ఉపసర్పంచ్లు పోతరాజుల లింగం, తుషాలపురం కనకయ్య, ఎంఆర్పీఎస్ నాయకుడు సుందరగిరి భాస్కర్, వార్డు సభ్యులు శిరబోయిన తిరుపతి, రావుల అజయ్, నాయకులు నాచగోని నరహరిగౌడ్, గెంటె శివ, ఆలేటి లక్ష్మారెడ్డి, గుంటిపల్లి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.