హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సంస్కృతి, అస్తిత్వానికి వెన్నెముకగా నిలిచిన చేనేత రంగం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తీవ్ర సంక్షోభంలో పడిందని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన చేనేత సంక్షేమ పథకాలను కాంగ్రెస్ సర్కార్ నిలిపివేసి నేతన్నల కడుపుకొడుతున్నదని, ఫలితంగా వేలాది నేత కార్మికుల కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురొంటున్నాయని పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చేనేత కార్మికులకు ఇచ్చిన హామీల్లో ఒకటీ అమలు కాలేదని, వెంటనే అన్నీ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో అమలైన చేనేత సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని కోరారు. శుక్రవారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పలు డిమాండ్లు, సూచనలతో కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. జాతీయ చేనేత దినోత్సవం కేవలం ఉత్సవాలు నిర్వహించుకొనే రోజు కాదని, చేనేత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే విధానాలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నదని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దొందూదొందేనని ఎద్దేవా చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి చేనేత రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయని
విమర్శించారు.
కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలో ఎకడా లేని విధంగా చేనేత రంగానికి ప్రత్యేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిందని కేటీఆర్ గుర్తుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 55,072 మంది చేనేత కార్మికులకు రూ.5 లక్షల జీవిత బీమా కల్పిస్తూ నేతన్న బీమా పథకాన్ని అమలు చేశామని, ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించిందని తెలిపారు. నేతన్నకు చేయూత పథకం ద్వారా కార్మికుల పొదుపును ప్రోత్సహిస్తూ ప్రభుత్వం తనవంతు వాటా జమ చేసేదని పేర్కొన్నారు. చేనేత సహకార సంఘాలకు పావలా వడ్డీ రుణాలు, 20% మారెటింగ్ రిబేట్ అందించడంతోపాటు బతుకమ్మ చీరలు, ప్రభుత్వ పాఠశాల యూనిఫారాల తయారీ వంటి భారీ ప్రభుత్వ ఆర్డర్లను చేనేత రంగానికే అప్పగించి వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పించామని వెల్లడించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేతన్న బీమా, నేతన్నకు చేయూత వంటి పథకాలు నిలిచిపోయాయని విమర్శించారు. చేనేత సహకార సంఘాలకు ఇవ్వాల్సిన పావలా వడ్డీ రుణాలు, మారెటింగ్ రిబేట్లు నిలిచిపోయాయని, బతుకమ్మ చీరలు, ప్రభుత్వ యూనిఫారాల వంటి ప్రభుత్వ ఆర్డర్లలో చేనేతకు గతంలో ఇచ్చిన ప్రాధాన్యత తగ్గించారని విమర్శించారు. ప్రభుత్వ ఆర్డర్లను కమీషన్ల కోసం ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులకు అప్పగిస్తున్నారని ఆరోపించారు.
అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని కేటీఆర్ విమర్శించారు. చేనేత భరోసా కింద ప్రతి ఏటా రూ.18 వేల ఆర్థికసాయం, అనుబంధ కార్మికులకు రూ.6 వేల సహాయం, రూ.లక్ష వరకు వ్యక్తిగత రుణమాఫీ, చేనేత సహకార సంఘాల క్యాష్ క్రెడిట్ రుణాల మాఫీ, చేనేత ఉత్పత్తులపై కేంద్రం విధిస్తున్న 5% జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు.
కానీ, ఈ హామీల్లో ఒకటీ కూడా అమలు కాలేదని దుయ్యబట్టారు. రెండున్నరేండ్లు గడిచినా హామీలు కాగితాలకే పరిమితమయ్యాయని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా చేనేత రంగానికి తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు. ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డు, హ్యాండీక్రాఫ్ట్స్ బోర్డు, పవర్లూమ్ బోర్డులను రద్దు చేయడం, హౌస్ కమ్ వర్షెడ్ వంటి పథకాలను ఎత్తివేయడం, చేనేత ఉత్పత్తులపై 5% జీఎస్టీ విధించడం వంటి నిర్ణయాలు చేనేత రంగాన్ని దెబ్బతీశాయని విమర్శించారు. చేనేత విషయంలో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల వైఖరిలో ఎలాంటి తేడా లేదని మండిపడ్డారు.
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను యుద్ధప్రాతిపదికన అమలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేతన్న బీమా, నేతన్నకు చేయూత పథకాలను వెంటనే పునరుద్ధరించి బకాయిలు విడుదల చేయాలని, ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన చేనేత భరోసా, రుణమాఫీ, జీఎస్టీ రీయింబర్స్మెంట్ హామీలను తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ‘మన చేనేత.. మన గౌరవం. నేతన్న బతికితేనే చేనేత బతుకుతుంది. చేనేత బతికితేనే మన సంస్కృతి, మన స్వాభిమానం సజీవంగా ఉంటాయి. ఇప్పటికైనా మోసపూరిత వైఖరిని వీడి నేతన్నల కుటుంబాలకు అండగా నిలబడాలి’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రాసిన బహిరంగ లేఖలో కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): మనిషికి నాగరికతను నేర్పిన మహోన్నత కళాకారులు మన నేతన్నలని, మగ్గాలతో అద్భుతాలు సృష్టించే సత్తా మన నేతన్నలకున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఎక్స్ వేదికగా నేతన్నలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘నరాలను పోగులుగా, తమ రక్తాన్ని రంగులుగా, గుండెలను కండెలుగా మార్చి, చెమట చుకలను చీరలుగా మలిచి, మనిషికి నాగరికతను అద్దిన చేనేత కార్మికులందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు. ఉమ్మడి పాలనలో తెలంగాణ చేనేత రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదురొన్నదని, అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసేంత అద్భుత నైపుణ్యం కలిగిన మన నేత కార్మికులు ఉపాధి లేక ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సి వచ్చిందని గుర్తుచేశారు.
నాడు వలస వెళ్లిన చేనేత కార్మికులు స్వరాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన వినూత్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాల ద్వారా తిరిగి తమ సొంత ఊళ్లకు చేరుకున్నారని గుర్తుచేశారు. ‘చేనేత మిత్ర’, ‘నేతన్నకు చేయూత’, ‘నేతన్న బీమా’, ‘బతుకమ్మ చీరలు’, ‘రుణమాఫీ’, ‘పెన్షన్లు’ వంటి ఎన్నో పథకాలతో నేతన్నల జీవితాల్లో కేసీఆర్ తిరిగి వెలుగులు నింపారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రవేశపెట్టిన పలు విప్లవాత్మక పథకాలు చేనేత రంగానికి కొత్త ఊపిరి పోశాయని వివరించారు. నేతన్నల సంక్షేమానికి, చేనేత పరిశ్రమ సర్వతోముఖాభివృద్ధికి బీఆర్ఎస్ ఎల్లప్పుడూ కట్టుబడే ఉంటుందని స్పష్టంచేశారు. నేతన్నల హకుల సాధనకు, వారి సంక్షేమానికి పార్టీ నిరంతరం పోరాడుతుందని హామీ ఇచ్చారు.