గుమ్మడిదల, ఫిబ్రవరి 10: డంపింగ్‌యార్డు చెత్త కంపుతో తమ జీవితాలను ఆగం చేయొద్దని నల్లవల్లి, ప్యారానగర్ గ్రామాల ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లిలో డంపింగ్‌యార్డు ఏర్పాటును విరమించుకోవాలని చేస్తున్న రిలే నిరాహార దీక్షలు సోమవారం ఆరోరోజుకు చేరుకున్నాయి. సోమవారం కొత్తపల్లి, నల్లవల్లి, ఫ్యారానగర్ గ్రామాల విద్యార్థులు గ్రామాల్లో ర్యాలీ నిర్వహించారు.
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందర్‌రావుకు తమ ఆందోళనలు పట్టవా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఎంపీ, ఎమ్మెల్యేలు స్పందించి డంపింగ్ యార్డు ఏర్పాటును అడ్డుకోవాలని కోరారు. ఆరు రోజులుగా అన్ని పనులు వదులుకుని ఆందోళనలు చేస్తుంటే అధికారులు స్పందించక పోవడం బాధాకరమని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళనలో నల్లవల్లి జేఏసీ నాయకులు ఫయాజ్, కుమ్మరి ఆంజనేయులు, మాజీ సర్పంచులు శంకర్, శ్రీనివాస్‌ముదిరాజ్, మన్నె రామకృష్ణ, సత్తయ్య, మహిళలు, యువకులు పాల్గొన్నారు.