అమీన్పూర్, జూలై 2 : పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో సంభవించిన ప్రమాద ఘటనలో రోజురోజుకూ మృతుల సంఖ్య పెరుగుతున్నది.కార్మికుల ఆచూకీ కోసం శిథిలాల తొలిగింపు ప్రక్రియ చేపడుతుండడంతో మృతదేహాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. శిథిలాల కింద లభ్యమవుతున్న మృతదేహాల పాటు వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు మృతి చెందుతున్నారు. కార్మికుల మృతదేహాలకు పటాన్చెరు ఏరియా దవాఖానలో పోస్టుమార్టం చేసి, బంధువులకు అప్పగిస్తున్నారు. పటాన్చెరు ఏరియా దవాఖానలో మృతదేహాల అప్పగింత ప్రక్రియ మందకొడిగా సాగుతున్నది.
మృతదేహాల సంబంధీకులు అక్కడికి వచ్చి పడిగాపులు కాస్తూ నానా అవస్థలకు గురవుతున్నారు.మృతుల కుటుంబీకులు ఏరియా దవాఖాన పరిసరాల్లో పగలు,రాత్రి నిద్ర, తిండి లేకుండా నరకయాతన పడుతున్నారు.వారికి కనీసం కూర్చునే చోటు సైతం లేకపోవడం, వారిని ఎవరూ పట్టించుకోకపోవడం చూస్తుంటే మనసు తరుక్కుపోతున్నదని అక్కడికి వచ్చిన పలువురు వాపోయారు.తమ వాళ్లను కోల్పోయి అనేక బాధల్లో ఉన్న మృతుల కుటుంబీకులు, బంధువులు రోదనలతో అల్లాడిపోతుంటే, ఎవరూ పట్టించుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మృతదేహాల కోసం వచ్చిన కుటుంబీకుల కోసం కనీస వసతులు ఏర్పాటు చేయలేదు. ఉదయం నుంచి సన్నగా కురుస్తున్న వర్షంతో ఎక్కడపడితే అక్కడ బురద, చిత్తడిగా మారిన పరిసరాల్లో ఇబ్బంది పడుతున్నారు. నాలుగు రోజులుగా మృతదేహాలు ఉండడంతో పటాన్చెరు ఏరియా దవాఖాన మార్చురీ పరిసరాలు దుర్గంధం వెదజల్లుతున్నది. దీంతో అక్కడికి వచ్చిన కుటుంబీకులు, బంధువులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తాగడానికి తాగునీరు లేకపోవడం,కనీస వసతులు ఏర్పాటు చేయకపోవడంతో ఇదేమి కర్మ అంటూ బోరున విలపిస్తున్నారు.
మా కుటుంబంలోని వ్యక్తిని కోల్పోయి తీవ్రమైన క్షోభతో మృతదేహాన్ని తీసుకు పోవడానికి పటాన్చెరు ఏరియా దవాఖానకు వస్తే ఇక్కడ నరకం కనిపిస్తున్నది.ఆపదలో ఉన్న మమ్మల్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఉదయం నుంచి వర్షంతో పరిసరాలు బురదమయంగా మారాయి. నిలబడే ఉంటున్నాం. త్వరగా మృతదేహాన్ని అప్పగిస్తే వెళ్లిపోతాం.తిండి లేక, నిద్ర లేక ఈ పరిసరాల్లో ఉండడం కష్టంగా ఉంది.
-మృతుడి బంధువు( కడప)
పరిశ్రమలో ప్రమాదం జరిగి నాలుగు రోజులు గడుస్తున్నప్పటికీ మృతదేహాన్ని అప్పగించలేదు.పరిశ్రమలో ప్రమాదం జరిగిందని తెలుసుకొని మా వారు పరిశ్రమ తో పాటు ధృవ దవాఖాన, పనేష మెరీడియన్ దవాఖాన, ప్రణమ్ దవాఖాన చుట్టూ తిరిగాం.అయినప్పటికీ మా బంధువు ఆచూకీ లభించలేదు.చివరగా పటాన్చెరు ఏరియా దవాఖానలో మృతదేహం ఆచూకీ లభించింది. మృతదేహం కోసం దవాఖాన వద్ద పడిగాపులు కాస్తున్నాం. మూడు రోజులుగా తిండి, నిద్ర కరువైంది. నాభర్త బావ ప్రవీణ్ కుమార్ ఏడాది క్రితమే సిగాచి పరిశ్రమలో డీజీఎంగా విధుల్లో చేరారు. అంతలోనే మృత్యువు ఆయన్ని కబళించింది .
-మృతుడి బంధువు వైజాగ్