పటాన్చెరు, సెప్టెంబర్ 23: సంగారెడ్డి జిల్లాలో 65వ జాతీయ రహదారి విస్తరణ పనులు నత్తనడకన సాగుతుండడంతో ప్రయాణికులు, వాహనదారులకు నరకం కనపిస్తున్నది. బ్రిడ్జిలు, సర్వీస్ రోడ్డు పనులు నమ్మెదిగా సాగుతున్నాయి. వర్షం పడితే ట్రాఫిక్ సమస్య ఏర్పడి వాహనదారులకు నరకం కనిపిస్తున్నది. రామచంద్రాపురం, అశోక్‌నగర్, పటాన్చెరు, శంకర్పల్లి చౌరస్తా, ముత్తంగి, ఇస్నాపూర్, లక్డారం, రుద్రారం వరకు నిత్యం ట్రాఫిక్ సమస్య తలెత్తుతున్నది.
వర్షం పడిన సమయంలో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయి ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. పటాన్చెరు పట్టణంలోని తహసీల్, ఎక్సైజ్, కార్యాలయం వద్ద సర్వీస్ రోడ్డు నిర్మాణం చేయకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పటాన్చెరు అర్టీసీ బస్టాండ్ నుంచి పాత టోల్గేట్ వరకు సర్వీస్ రోడ్డు పనులు చేయకపోవడంతో పాటు ప్రధాన రోడ్డుకు, సర్వీస్ రోడ్డుకు మధ్యలో నిర్మాణం చేస్తున్న వరద కాల్వలు నాణ్యతగా నిర్మాణం చేయడం లేదు. కొన్నిచోట్ల వర్షానికి వరద కాల్వలు ధ్వంసం అయ్యాయి.
రామచంద్రపురం,బీరంగూడ, అశోక్‌నగర్ వద్ద ప్రతిరోజు ట్రాఫిక్ సమస్య ఏర్పడుతున్నది. 65వ జాతీయ రహదారి రోడ్డు పనులను నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణలో జరుగుతున్నాయి. ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణ సరిగా లేకపోవడం, కాంట్రాక్టర్ పనులు వేగవంతంగా చేయకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు తప్పడం లేదు. లక్డారం, రుద్రారం గణేశ్ మందిర్ వద్ద బ్రిడ్జి పనులు కొనసాగడంతో సర్వీస్ రోడ్డులో వాహనాలను పంపిస్తున్నారు.
సర్వీస్ రోడ్డులో వాహనాలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ సమస్య ఏర్పడుతున్నది. వర్షం పడితే కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. ఓఆర్ఆర్ సమీపంలో హోటల్ ముందు వాహనాలు నిలిపివేయడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. సర్వీస్ రోడ్డు పూర్తి చేయకపోవడంతో పాటు పెద్ద గుంతలు ఉండడంతో వాహనాలు నిలిచిపోతున్నాయి. అధికారులు వేగంగా పనులు పూర్తిచేయించి సమస్య పరిష్కరించాలని వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు.
వర్షంతో పనులు నిలిచిపోతున్నాయి
65వ జాతీయ రహదారి విస్తరణ పనులు వేగంగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. వర్షం పడడంతో కొన్నిచోట్ల పనులు నిలిచిపోతున్నాయి. సర్వీస్ రోడ్డు పనులు పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్‌కు సూచనలు చేశాం. వర్షం కురవడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. నాణ్యతగా రోడ్డు విస్తరణ పనులు చేపట్టి ప్రయాణికులు, వాహనదారుల ఇబ్బందులు తొలిగిస్తాం.
– రామకృష్ణ , ఎన్హెచ్ఏఐ డీఈఈ