పటాన్చెరు/జహీరాబాద్, నవంబర్ 21: కూరగాయల ధరలు కొండెక్కడంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. ఏ కూరగాయ ధర చూసినా భగ్గుమంటున్నది. దీంతో కొన లేం.. తినలేం అన్నట్లుగా పరిస్థితి మారింది. కొద్దిరోజులుగా జిల్లాలో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి. నవంబర్‌లో సాధారణంగా కూరగాయల ధరలు తకువగా ఉంటా యి. కానీ, వరు స వర్షాలు, మొంథా తుపాన్‌తో భారీగా కూరగాయల పంటకు నష్టం జరిగింది. దిగుబడి సైతం బాగా తగ్గింది. ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకోవడంతో ఖర్చులు పెరిగాయి.ఏ కూరగాయ చూసినా కిలో రూ.80-100 వరకు పలుకుతున్నది. పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తుపాను ముందు టమాటా కేజీ రూ.20 నుంచి రూ.40 రూపాయలు ఉండేది. ఇప్పుడు రూ. 50 నుంచి 60 ధర పలుకుతున్నది. టమాటా లేనిదే ఏ వంట చేసుకోని పరిస్థితి. దీంతో తప్పనిసరిగా కిలో కొనేవారు అరకిలో కొని సరిపెట్టుకుంటున్నారు. ఆకుకూరల ధరలు సైతం ఆకాశాన్ని అంటాయి. పటాన్చెరులో, న్యాల్కల్, హద్నూర్ సంతల్లో టమాటా కిలోకు రూ.60 ఉండగా, బెండకాయ-రూ.80, పచ్చిమిర్చి-రూ. 100, బీరకాయ-రూ.80, అల్లంవెల్లి గడ్డ-రూ.120, క్యారెట్ రూ.100, బీట్రూట్ రూ.100, వంకాయ రూ.110, గోబీ రూ. 80 ధర పలుకుతున్నాయి.
పాలకూర, గోంగూర, మెంతికూర వంటి ఆకుకూరలు సైతం కిలో రూ.40-50కి చేరాయి. మిగిలిన కూరగాయల ధరలు ఇంచుమించు రూ.40-80 మధ్య పలుకుతున్నాయి. పెరిగిన కూరగాయల ధరతో ఏం కొనేటట్టు లేదు…ఏం తినేటట్టు లేదు అంటూ బాధపడాల్సిన రోజులొచ్చాయని ప్రజలు వాపోతున్నారు. క్యారెట్,బీన్స్,క్యాప్సికం వంటి కొన్ని కూరగాయలు కేజీ రూ. 120, రూ.150లు కూడా దాటుతున్నాయని వినియోగదారులు వాపోతున్నారు. పెరిగిన రేట్లతో రూ.500లు పెట్టినా మూడు రోజులకు సరిపోయే కూరగాయలు రావడం లేదు. సంగారెడ్డి జిల్లాలో తుపాను, వర్షాలతో కూరగాయల పంటలు దెబ్బతిని, దిగుబడి తగ్గింది. సాగు సైతం కొద్దిరోజులుగా తగ్గింది.
దీంతో మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ నుంచి ప్రధాన పట్టణాలకు దిగుమతి చేసుకుంటున్నారు. దీంతో రవాణా ఖర్చులు పెరగడంతో ధరలు పెరిగాయని కూరగాయల వ్యాపారులు చెబుతున్నారు. కార్తిక మాసంలో నాన్‌వెజ్‌కు డిమాండ్ తగ్గి, కూరగాయల వినియోగం పెరగడంతో సైతం ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. కొంతకాలంగా కూరగాయల సాగుకు ప్రభుత్వ ప్రోత్సహించక పోవడంతో సాగు తగ్గింది. యాసంగి సీజన్ ప్రారంభమై నెలరోజులు అవుతున్నా, కూరగాయల సాగుకు ఉద్యానశాఖ నుంచి అవసరమైన ప్రోత్సాహం అందడం లేదని రైతులు చెబుతున్నారు. యాసంగి పంట చేతికి వస్తే మరో మూడు వారాల్లో కొంత వరకు ధరలు దిగివస్తాయని వ్యాపారులు పేర్కొంటున్నారు.