గజ్వేల్, ఏప్రిల్ 6: సీఎం రేవంత్‌రెడ్డి అండతోనే కాంగ్రెస్ నాయకులు గూండాయిజం చేస్తున్నారని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శించారు. సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ బంద్‌లో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడారు. పదేండ్లలో రాష్ర్టాన్ని అభివృద్ధిలోకి తీసుకువెళ్లిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు.
కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడికి పాల్పడిన కాం గ్రెస్ గూండాలకు రేవంత్‌రెడ్డి అండగా ఉంటున్నారని, బేషరతుగా కేసీఆర్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గజ్వేల్‌లో జరిగిన దాడి, రేవంత్‌రెడ్డి తీరుపై ప్రజల్లో అసహనం వ్యక్తమవుతున్నదన్నారు. సర్పంచ్, మున్సిపాలిటీ ఎన్నికల్లో గజ్వేల్‌లో కాంగ్రెస్‌కు ఘోర పరాభావం ఎదురవడంతో ప్రజ ల్లో ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా చేస్తున్న ఇలాంటి సంఘటనలపై రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌పై నిరసన వ్యక్తమవుతుందన్నారు.
గజ్వేల్ బంద్‌లో అన్నివర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేశారని గుర్తుచేశారు. అభివృద్ధిని స్వాగతించకుండా విమర్శలతో కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్‌పై కేసులు వేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న కాంగ్రెస్ రెండున్నరేండ్లలో ఫెయిల్ అయ్యిందన్నా రు. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ గూండాయిజం చేస్తున్న కాంగ్రెస్ నాయకులకు ప్రజలు బుద్ధిచెబుతారన్నారు. గజ్వేల్ బంద్‌కు సహకరించిన అన్నివర్గాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
గజ్వేల్ అభివృద్ధిని కేసీఆర్ 50 ఏండ్ల ముందుకు తీసుకువెళ్లారని, రెండేండ్లలోనే పదేండ్ల అభివృద్ధిని వెనక్కి తీసుకువెళ్లిన రేవంత్‌రెడ్డి ఫొటో పెట్టాలా అని ఏఎంసీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ప్రశ్నించారు. గజ్వేల్ అభివృద్ధి కోసం కేసీఆర్ నిధులు మంజూరు చేస్తే వాటిని రద్దు చేసినందుకు రేవంత్‌రెడ్డి ఫొటో పెట్టాలా అని అన్నారు. కేసీఆర్ గజ్వేల్‌కు రాక ముందు ఎలా ఉండే, వచ్చిన తర్వాత ఎలా ఉందో తెలుసుకొని మాట్లాడాలన్నారు. 2009 నుంచి 2014వరకు గజ్వేల్‌లో కాంగ్రెస్ రూపాయి అభివృద్ధి పని చేయకుండా ఎలా కాలం వెళ్లదీసిందో ప్రజలకు తెలుసన్నారు. కాంగ్రెస్‌పై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, ఎదుగుదల కోసం డీసీసీ అధ్యక్షురాలు తాపత్రయపడుతుంది తప్పా మరేమీ లేదన్నారు. తెలంగాణ సాధించిన కేసీఆర్‌పై కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం సిగ్గుచేటన్నారు.