కనగల్, ఆగస్టు 13 : సంఘటిత, అసంఘటిత రంగాల్లో ఎగుమతి దిగుమతి పనులు నిర్వహిస్తున్న హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సిఐటియు కనగల్ మండల కన్వీనర్ నెలగొందారాసి లింగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం తెలంగాణ హాల్ హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కనగల్ మండల తాసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా లింగయ్య మాట్లాడుతూ.. 2023లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా హమాలీలకు పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తూ హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, ప్రభుత్వమే వ్యక్తిగత ఇన్సూరెన్స్ చేయించాలని, 50 సంవత్సరాలు నిండిన ప్రతి కార్మికుడికి నెలకు రూ.6 వేల పెన్షన్ సౌకర్యం కల్పించాలని, హమాలీ కార్మికుడు పని ప్రదేశంలో చనిపోతే రూ.25 లక్షల ఇవ్వాలని, మట్టి ఖర్చుల కింద రూ.50 వేల ఇవ్వాలన్నారు. ఈ ప్రభుత్వం పైన అనేకసార్లు ఆందోళన, పోరాటాలు నిర్వహించిన హమాలీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. ఇప్పటికే ఇండ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, లేబర్ కార్డు ఇవ్వాలని, రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల సేకరణ ఆందోళన నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం స్పందించి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయని యెడల సెప్టెంబర్ లో చలో అసెంబ్లీ నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హమాలీ యూనియన్ నాయకులు కలిమెర నిరంజన్, ఎం.పల్లయ్య, రామలింగయ్య, శంకరయ్య, వెంకటేశం పాల్గొన్నారు.