బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులోని అధ్వాన్న రోడ్డు కేరళ మహిళను బలిగొన్నది. బైక్ నుంచి జారిన ఆమె రోడ్డుపై పడగా గూడ్స్ రవాణా వాహనం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆ మహిళ అక్కడికక్కడే మరణించింది. ఈ నేపథ్యంలో బెంగళూరులోని అధ్వాన్న రోడ్లపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. (Kerala Woman Killed In Bengalur) కేరళకు చెందిన 32 ఏళ్ల మేధా ఆకర్ష్ తన భర్త, మూడేళ్ల చిన్నారితో కలిసి బెంగళూరులో నివసిస్తున్నది. నగరంలోని ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయంలో ఆమె పని చేస్తున్నది.
కాగా, బుధవారం ఉదయం సహోద్యోగి అజయ్ బైక్పై మేధా ప్రయాణించింది. హెబ్బగోడి సమీపంలోని అనంతనగర్ మెయిన్ రోడ్డులో ముందు వెళ్తున్న కారు సడన్ బ్రేక్ వేయడంతో బైక్ అదుపుతప్పింది. బైక్ వెనుక కూర్చొన్న మేధా రోడ్డు కుడి వైపు పడిపోయింది. అటుగా వచ్చిన గూడ్స్ వాహనం ఆమె పైనుంచి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే గుంతలమయమైన అధ్వాన్న రోడ్డు మేధా మరణానికి కారణమని స్థానికులు మండిపడ్డారు.