గజ్వేల్, డిసెంబర్ 22: కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యంకావాలని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి సూచించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని బూరుగుపల్లి, కొల్గూర్, శేర్పల్లి, రాయవరం, తిమ్మాపూర్, జగదేవ్‌పూర్, ఎర్రవల్లి, జబ్బాపూర్ గ్రామాల్లో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సర్పంచ్‌లను సోమవారం ఆయన అభినందించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లోని ప్రజలకు అందుబాటులో ఉండాలని, అప్పుడే జనం మన్ననలు పొందుతారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ సహకారంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసుకున్నామని, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్నారు. ప్రజలు మీకిచ్చిన గౌరవాన్ని తగ్గించుకోకుండా సేవ చేయాలని, అప్పుడే మరింత రాజకీయ భవిష్యత్ ఉంటుందన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు జెండా ఎగురవేశారన్నారు.
రాబోయే ఎంపీటీసీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. పదేండ్ల కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధిని ప్రజలు మరోసారి కోరుకుంటున్నారన్నారు. కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల్లో చేరగని ముద్ర వేశాయన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు బెండే మధు, నవాజ్‌మీరా, నాయకులు రమేశ్‌గౌడ్, విరాసత్‌అలీ, ఆకుల దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.