గజ్వేల్, మే 30: కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే కేసీఆర్ కుటుంబంపై రేవంత్‌రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని, రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసులు జారీ చేశారని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కాలయాపన చేస్తూ కేసీఆర్, హరీశ్‌రావును ప్రజల్లో చులకన చేస్తూ మాట్లాడుతున్నారని విమర్శించారు.
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కొద్ది రోజుల్లోనే విఫమైందని, ఎల్అండ్టీ సంస్థ ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే, నిర్ధారణ కాకముందే రాజకీయ దురుద్దేశంతోనే నోటీసులు జారీ చేశారన్నారు. ప్రాజెక్టుకు పెట్టిన వ్యయం రూ.94వేల కోట్లు అయితే అందులో లక్షకోట్ల అవినీతి జరిగిందని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రెండు లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులు, కొత్త పథకాలను ఎక్కడా ప్రవేశపెట్టలేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే చిత్తుగా ఓడిపోతామనే భయంతో కాంగ్రెస్ ముందుకురావడం లేదని, బీఆర్ఎస్నే ప్రజలు ఆశీర్వదించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు దోచుకుంటున్నారని, అవినీతి పెరిగిపోయిందన్నారు.
ప్రభుత్వంలో ప్రజలకు భద్రత లేదని 20శాతం కమీషన్ కోసం కౌంటర్ ఏర్పాటు చేయాలని హితువు పలికారు. రూ.6వేల కోట్ల ప్రజాధనాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆపార్టీ కార్యకర్తలకు పప్పు, బెల్లంలా పంచిపెడుతుందని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ పార్టీలతో సంబంధం లేకుండా రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
సమావేశంలో మాజీ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవీ రవీందర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మర్కూక్ కరుణాకర్‌రెడ్డి, నవాజ్‌మీరా, సర్పంచ్ల ఫోరం మాజీ మండలాధ్యక్షుడు చంద్రమోహన్‌రెడ్డి, నాయకులు జకీయొద్దీన్, నర్సింగరావు, రమేశ్‌గౌడ్, రమేశ్, సంతోష్‌రెడ్డి, యాదగిరి, కనకయ్య, మన్నె వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.