గజ్వేల్, మే 23: ఏపీ సీఎం చంద్రబాబుకు గురుదక్షిణగా సీఎం రేవంత్‌రెడ్డి మేడిగడ్డను మాయం చేసే కుట్ర చేస్తున్నారని, నరేంద్రమోదీ, రేవంత్‌రెడ్డి, చంద్రబాబులు ఒక్కటై ఆకుపచ్చ తెలంగాణను ఎడారిగా మార్చేందుకు కుట్ర జరుగుతున్నదని దానిలో భాగంగానే కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసులు పంపారని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్‌ను వేధించేందుకే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కేంద్రంలోని నరేంద్రమోదీతో జతకలిసి కాళేశ్వరంపై నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. రాజకీయ కక్షసాధింపు చర్యలే అని, చంద్రబాబు హయాంలో నిర్మించిన పోలవరం ప్రాజెక్టులో ప్రమాదం జరిగి ఏడేండ్లు గడిచినా విచారణ చేయకుండా నరేంద్రమోదీ ప్రభుత్వం అప్పటి సీఎం చంద్రబాబుకు నోటీసులు పంపకుండా వత్తాసు పలికిందన్నారు.
ఇప్పుడు ప్రమాదం జరిగిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం రూ.1000 కోట్లు మంజూరు చేసిందన్నారు. తెలంగాణలో కుంగిన ఫిల్లర్లకు రూపాయి కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు. పార్లమెంట్లో కాళేశ్వరం, పోలవరం ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని తెలంగాణ ఎంపీలు ఎన్నిసార్లు అడిగి, ధర్నాలు చేసినా కేవలం పోలవరానికి మాత్రమే జాతీయహోదా ఇచ్చి కాళేశ్వరానికి మొండిచేయి చూపడం దారుణమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోని నీటి దోపిడీని అరికట్టడానికి రీడిజైన్ చేసి స్వల్పకాలంలో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 450టీఎంసీలకు పైగా నీటిని వినియోగించుకునే విధంగా కేసీఆర్ ప్రాజెక్టును నిర్మించడంతో కోటి ఎకరాల మాగాణితో తెలంగాణ దేశానికి అన్నంపెట్టే అన్నపూర్ణగా మారిందన్నారు. మేడిగడ్డ బ్యారేజీలో తలెత్తిన చిన్నపాటి సాంకేతిక లోపాన్ని సాకుగా చూపుతూ ఫిల్లర్లను రిపేర్ చేయకుండా కాళేశ్వరం జలాలను తెలంగాణకు దక్కకుండా కుట్రలను చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కాళేశ్వరం గొప్పతనాన్ని సుప్రీంకోర్టు తెలిపినా ఇక్కడ ఉన్న అసమర్థ రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి అర్థం కావడం లేదన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు దేశానికి తలమానికమని, రాష్ర్టానికి ఆత్మగౌరవ ప్రతీక అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్‌రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టి మరల్చడానికి, కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీయడానికి అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టు నిర్మాణానికి రూ.94వేలకోట్లు ఖర్చు అయితే లక్షకోట్లు స్కాం అంటూ మాట్లాడడం దారుణమన్నారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా కేసీఆర్, హరీశ్‌రావును ఏమీచేయలేరన్నారు. ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. సమావేశంలో మాజీ కౌన్సిలర్లు మెట్టయ్య, దుర్గాప్రసాద్, నాయకులు మల్లేశం, అహ్మద్ పాల్గొన్నారు.